ఏపీలో అధికార బ‌ద‌లాయింపు జ‌రిగి ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. అటు సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకు వెళ్ల‌డంతో పాటు ఇటు పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు పావులు క‌దుపుతున్నారు జ‌గ‌న్‌. అందులో భాగంగా ఇప్పుడు జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో స‌మూల మార్పుల‌తో పాటు, ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు  చేర్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగానే పార్టీని కూడా బ‌లోపేతం చేసేందుకు స‌న్న‌హాలు చేశారు. ప్ర‌భుత్వ సమీక్ష‌లు చేస్తూనే ప‌నిలోప‌నిగా పార్టీ బ‌లోపేతం కోసం చేయాల్సిన వ్యూహాల‌ను కూడా ర‌చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ యేడాది ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి చెందిన స్థానాల‌పై దృష్టి నిలిపారు. అందులో భాగంగా ప్ర‌కాశం జిల్లాలోని నాలుగు స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు జ‌గ‌న్‌.

 

ప్ర‌కాశం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో కొండేపి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఓట‌మి చెందింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోవు ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ పార్టీ బ‌లోపేతం కావాల‌ని, అందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై నేత‌లు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన జ‌గ‌న్ చిన్నాన్న, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జ‌గ‌న్ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డిలు స‌మావేశ‌య్యారు.

 

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల‌పై, పార్టీ బ‌లోపేతంపైన‌, స‌మ‌స్య‌ల‌పై, నాయ‌కుల ప‌నితీరుపై అమరావతిలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కలిసి   బాలినేనితో సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాల స‌మాచారం. పర్చూరులో రావి రామనాథం నాయకత్వం పై అనుమానాలు వ్యక్తం చేయగా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని డిసైడ్ చేశారు. అవసరమైతే ఎన్నికలకు ఏడాది ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయానికి వచ్చారు.

 

అద్దంకి, కొండపి నియోజక వర్గాల్లోనే నాయకత్వం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి సారించి అవసరమైతే తమ రిమోట్ లోకి తీసుకుని అయినా సరే పార్టీని పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని బాలినేనికి సూచించారు. చీరాలలో రోజుకొక వివాదం అక్కడ పార్టీ పరిస్థితులు నాయకుల చేరికల పై ఆరా తీసినట్టు సమాచారం. పరుచూరులో ఎదురైన పరిస్థితులను చివరి వరకూ తెలుసుకోలేకపోవడం పై డిస్కస్ చేసుకున్నారు. 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ జెండా ఎగుర‌వేయాల‌ని ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించారు.

 

అవ‌స‌ర‌మైతే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే అందుకు త‌గిన విధంగా ఇప్ప‌టి నుంచే పార్టీని ప‌టిష్టం చేయాల‌ని కూడా  ఈ భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ట‌. ఏదేమైనా రాబోవు ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి  నుంచే పార్టీని స‌మాయ‌త్తం చేసుకోవాల‌నే ఆలోచ‌నతో ముందుకు సాగుతున్న‌ది. అయితే వైసీపీ ఆలోచ‌న ఇలా ఉంటే.. అటు టీడీపీ కూడా ఇప్ప‌టి నుంచే ప్ర‌కాశం జిల్లాలో త‌మ ప‌ట్టును నిలుపుకునే దిశ‌గా అడుగులు వేస్తుంది. అందుకు త‌గిన విధంగా చంద్ర‌బాబు కూడా క్యాడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: