దిశ.. ఇప్పుడు దేశమంతా మౌనంగా రోదిస్తోంది ఈ అమ్మాయి గురించే.. కామాంధుల చేత చిక్కి నరకయాతన అనుభవించిన ఈ వెటర్నరీ డాక్టర్ కు సంబంధించన ఫోటో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. దిశ హైదరాబాద్ శివార్లలోని ఓ పశువైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పని చేసేది గ్రామీణ ప్రాంతం.

 

ఇప్పుడు ఆమె సేవలను ఆయా ప్రాంతాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఓ పశువుకు వైద్యం చేస్తున్నప్పటి ఫోటోను ఆయా గ్రామవాసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మూగజీవాల వేదన తీర్చిన ఆమె ఇంత దారుణంగా హతమవ్వడం వారిని కలచివేస్తోంది.

చిన్న వయస్సులోనే వెటర్నరీ కోర్సు పూర్తి చేయడమే కాకుండా.. వెంటనే ప్రభుత్వ ఉద్యోగం అందుకున్న ఆమె అంకిత భావంతో వృత్తి నిర్వహించేదని తెలుస్తోంది.

 

అందానికి అందం.. అనుకువ.. సేవాభావం ఉన్న దిశకు త్వరలోనే పెళ్లి చేయాలని కూడా తల్లిదండ్రులు సంకల్పించారు. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. కామాంధుల కీచక కాండ దేశాన్నే నివ్వెర పరిచింది. ఇప్పుడు దిశ గాధ దేశమంతా మారుమోగుతోంది. ఇలాంటి మరో ఉదంతం జరగకుండా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సైతం నినదిస్తోంది.

 

ఇదే సమయంలో ఇలాంటి దారుణాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏకంగా చట్టాలు మార్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అవసరమైతే కొత్త చట్టాలు కూడా తెస్తామని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. మరోసారి దిశ ఉదంతం చట్టాలు మార్చాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిర్భయ రాక్షసులకు కూడా ఇంకా ఉరి శిక్ష అమలు కాని నేపథ్యంలో సత్వర శిక్షల అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఇలాంటి కామాంధులకు ఆ వార్తల వేడి చల్లారక ముందే.. ఉరి శిక్ష పడేలా చట్టాలు సవరిస్తే.. అదే దిశకు నివాళి అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: