ఆర్టీసీ స‌మ్మె ఎఫెక్ట్‌లో కీల‌క‌మైన ఆర్టీసీ చార్జీల పెంపు అమ‌లులోకి వ‌చ్చింది.బస్‌‌ చార్జీలు పెంచనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆదివారం అర్ధరాత్రే అమలు చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడిసోమవారం అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన చార్జీలతో ఆర్టీసీకి ఏటా రూ.752 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. అయితే, ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు మాత్రం ఈ విష‌యంలో షాకుల పరంప‌ర కొనసాగుతోంది.

 


కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచడానికి ప్రభుత్వం అనుమతించడంతో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం.. బస్సులవారీగా పెంచిన చార్జీలను ప్రకటించింది. సామాన్యుడు ఎక్కే పల్లెవెలుగు, ఆర్డినరీ, మొద‌లుకొని డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల వంటి అన్ని రకాల బస్సుల్లో చార్జీలను పెంచేశారు.  ఇప్పటివరకు పల్లెవెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రతి ఐదు కిలోమీటర్ల ప్రాతిపదికన కనీస చార్జీ రూ.6 గా ఉండేది. ఇప్పుడు ఈ కనీసచార్జీని రూ.10 కి పెంచారు. ప్రతి రెండు కిలోమీటర్ల ప్రాతిపదికన సిటీలో కొనసాగుతున్న కనీస చార్జీలను ఆర్డినరీలో రూ.10 కి పెంచారు. మెట్రో డీలక్స్‌ కనీసచార్జీ రూ.10 నుంచి రూ.15కు పెరిగింది. పండుగలు, జాతరల సందర్భాల్లో నడిపే ప్రత్యేక సర్వీసులకు సాధారణ చార్జీల కంటే 1.5 రెట్లు వ‌సూలు చేయ‌నున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం ఇచ్చే కాంబో టికెట్ల చార్జీలను పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీసధర (రూ.10)లో మార్పుచేయలేదు. 

 

రాష్ట్రంలో కొత్త బస్ చార్జీలు నేటి నుంచే అమలులోకి రాగా ఈ చార్జీల పెంపులో మ‌రో షాక్ ఇత‌ర చార్జీల వ‌డ్డన‌. టోల్‌ప్లాజా టారిఫ్‌, ప్యాసింజర్‌ సెస్‌, ఎమినిటీస్‌, ఏసీ సర్వీసులపై జీఎస్టీ తదితర చార్జీలు అదనమని ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది. అంతేకాదు సబ్సిడీ బస్ పాసులపై కూడా వడ్డనకు నిర్ణయం తీసుకుంది సంస్థ. దీంతో విద్యార్థులతో పాటు నిత్యం సిటీ బస్సు పాసులు వాడే వారిపైనా భారం పడుతోంది. పాసులతో ప్రయాణించే వారికి కొట్టే కాంబినేషన్ టికెట్ ధరను మాత్రం యథావిధిగా రూ.10గానే ఉంచారు. అయితే సిటీ బస్సుల్లో 24 గంటల పాటు తిరగడానికి వీలుగా ఇచ్చే డే పాస్‌ను రూ.80 నుంచి 100కు ఆర్టీసీ పెంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: