ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం కొత్త రూల్స్ ను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదవాళ్లందరికీ సెంటు భూమి చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు ఇచ్చేరోజునే ఆ ఇంట్లోని అక్కా చెల్లెళ్ల పేరుపై ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తారు. 
 
ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వం అపార్ట్‌మెంట్లను నిర్మించి ఫ్లాట్లను ఇవ్వాలని చూస్తోందని సమాచారం. 2020 సంవత్సరం ఉగాది పండుగ నాటికి 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకానికి ధరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ధరఖాస్తుతో పాటు రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ జిరాక్స్ లేని వారు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి ధరఖాస్తు చేసుకోవచ్చని సమాచారం. 
 
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎమ్మార్వోలు ఖాళీగా ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను అందించనున్నారు. అధికారులు ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తో లింక్ చేసి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు కేటాయిస్తారు. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాక ఐదు సంవత్సరాల పాటు ఆ భూమిని ఎవరికీ అమ్మకూడదు. 
 
ఐదు సంవత్సరాల తరువాత మాత్రం భూములను అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం పొందుపరుస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఈ పథకం వలన పేదలకు 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. ఈ పథకం వలన రాష్ట్రంలోని పేదలకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: