జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలనం చోటు చేసుకుంది.  వైసిపి నేత, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సిట్ విచారించింది. విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చిన సిట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం నుండి భాస్కరరెడ్డిని విచారణ చేస్తున్నారు. మొన్న మార్చి 15వ తేదీన సొంత ఇంటిలోనే వివేకా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లోనే అంటే చంద్రబాబునాయుడు హయాంలోనే  ఏర్పడిన సిట్ మొక్కుబడిగా కొందరిని విచారించింది.

 

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి కొత్తగా మరో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇపుడు ఆ సిట్ బృందమే ఎంపి తండ్రిని విచారణకు పిలిపించటమే ప్రభుత్వంలోను, పార్టీలోను సంచలనంగా మారింది. నిజానికి అధికారపార్టీకి చెందిన నేతలజోలికి పోలీసులు కానీ ఇతర శాఖల అధికారులు కానీ వెళ్ళరన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సిట్ బృందం ఎంపి తండ్రిని కూడా విచారణకు పిలవటమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

భాస్కరరెడ్డితో పాటు మనోహర్ రెడ్డి, ఇద్దరు టిడిపి నేతలను కూడా విచారణకు పిలిచారు. అందరినీ కడపలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. మొన్నటి మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబీకుల హస్తమే ఉందని చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు బహిరంగంగానే ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రాణహాని ఉందని మొత్తుకున్న వివేకానందరెడ్డి తనకు భద్రత పెంచాలని ఎంత మొత్తుకున్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.

 

తీరా వివేకా హత్యకు గురైన తర్వాత మొత్తం బాధ్యతను వైఎస్ కుటుంబం మీదే వేయాలని  చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్యకేసులో ఎవరెవరు ఉన్నారన్నది భగవంతుడికే తెలియాలి. అయితే ఈ హత్యపై టిడిపి నేతలు మాత్రం ఎన్నికల ముందు పెద్ద రాజకీయమే చేశారు. సరే ఎంత రాజకీయం చేసినా జిల్లాలో జనాలు పట్టించుకోలేదనుకోండి అది వేరే సంగతి. అందుకనే పదికి పది నియోజకవర్గాల్లో వైసిపినే గెలిపించారు.   ఇప్పటికైనా సిట్ విచారణలో స్పీడు పెంచి హత్యకు కారకులను బయటపెడితే బాగుంటుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: