దేశంలో రాజకీయాలు రాజకీయాలు దారుణంగా మారిపోతున్నాయి.  ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్ధం కావడం లేదు.  ఎన్నికలకు ముందు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం ఎక్కువగా ఉంటుంది.  ఎన్నికల తరువాత ఆంతా నిశ్శబ్దంగా మారిపోతుంది.  ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శిస్తూ  కాలాన్ని గడిపేస్తుంటారు.  అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం దానికి విరుద్ధంగా నడుస్తున్నారు.  టచ్ చేయకూడని విషయాలను ఈ సమయంలో టచ్ చేస్తూ అందరిలోనూ అలజడి రేపుతున్నారు.  


ఒకవిధంగా చూసుకుంటే పవన్ చెప్పిన మాటలు కొంతవరకు వాస్తవంగానే ఉన్నా.. రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడితే.. గొడవలు జరుగుతాయి. తాను సత్యాన్ని నమ్ముకున్నానని, సత్యం మాట్లాడే వాడికి ధైర్యం ఉంటుందని, ఆత్మవిశ్వాసం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.  తిరుపతిలో ప్రతి ఒక్కరిని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్ తెలుగు హీరోలను కూడా వదలలేదు.  తెలుగు హీరోలలో చాలామందికి తెలుగు చదవడం, రాయడం రాదనీ విమర్శించారు.  ఇది నిజమే.  చాలామంది హీరోలకు తెలుగు చదవడం రాదు.  ఆ విషయం అందరికి తెలుసు.  


తెలుగు సినిమాల్లో గతంలో మాదిరిగా పాండిత్యం లోపిస్తోందని పవన్ పేర్కొన్నారు.  తెలుగు పాండిత్యం లోపించి బూతు మాటలు రావడంతో తెలుగు సినిమా దిగజారిపోతోందని అన్నారు.  సినిమాల్లో బూతు, రేప్ వంటివి ఉండటం వలన దానిని చూసి నేరాలు ఎలా చేయాలో తెలుసుకుంటున్నారని పవన్ చెప్పడంతో తెలుగు సినిమా పరిశ్రమ షాక్ అయ్యింది.  ఇక  మతతత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.  


రాజకీయాల్లో మతాల మధ్య గొడవలు సృష్టించేది హిందూ రాజకీయ నాయకులే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.  హిందువులే గొడవలకు కారణం అని చెప్పడం వెనుక కారణం ఏంటో తెలియడం లేదు.  హిందూ  దేవాలయాలలో అన్యమత ప్రచారం జరుగుతోందని మండిపడిన  పవన్, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పిన పవన్, ఇప్పుడు ఏకంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నది హిందూ రాజకీయ నాయకులే అని చెప్పడం వెనుక పవన్ ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: