దిశ అత్యాచార ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్న సమయంలో ఆమె గురించి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దిశ హైదరాబాద్ శివార్లలోని ఓ పశువైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిశకు సంబంధించిన పాత జ్ఞాపకాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అత్యాచారం, హత్యకు గురైన ‘దిశ’కు ఓరుగల్లుతోనూ అనుబంధం ఉందట.

 

ఎందుకంటే.. దిశ 8 నుంచి 10వ తరగతి వరకు హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో చదివుకుందట. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ అక్కడ హాస్టల్ లో ఉండి విద్యాభ్యాసం పదో తరగతి వరకూ పూర్తి చేసుకుందట. దిశకు పదో తరగతిలో 536 మార్కులు వచ్చాయట. పాఠశాల డైరెక్టర్‌ భరద్వాజనాయుడు ఆమె జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. దిశకు సహాయ గుణం చాలా ఎక్కువట. బహుశా అందుకే ఆమె ఆ తర్వాత కాలంలో వైద్యవిద్యను తన కేరీర్ గా ఎంచుకుని ఉండొచ్చు. అంతే కాదు.. దిశ గ్రీన్ వుడ్ పాఠశాలలో ఇచ్చే మోస్ట్‌ హెల్పింగ్‌ స్టూడెంట్ పురస్కారం దక్కించుకుందట.

 

తాము ఊహించినట్టే.. దిశ ఆ తర్వాత కాలంలోనూ విద్యలో రాణించిందని పాఠశాల డైరక్టర్ అంటున్నారు. చిన్నవయస్సులోనే వెటర్నరీ డాక్టర్ గా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడిందని ఆమె జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ పాఠశాలలో దిశ అత్యాచారానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు.

 

ఇక ఇటీవల దిశ అంత్యక్రియలు పూర్తి చేసిన తల్లిదండ్రులు... బీచుపల్లిలో దిశ అస్థికల నిమజ్జనం చేశారు. దిశ అస్థికలను ఆమె తండ్రి జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. సోమవారం కుటుంబసభ్యులు, దిశ స్నేహితులతో కలిసి బీచుపల్లికి చేరుకున్న తండ్రి దిశకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: