సంక్రాంతి పండుగ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పందెంకోళ్ళు....పండుగ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో అందులోనూ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ళ పందేలు విపరీతంగా జరుగతాయి. ఈ సంక్రాంతి సంబరాలు జరిగే మూడు రోజుల మామూలు ప్రజలేమో గానీ పందెం రాయుళ్లు తమ తరహాలో పండగ చేసుకుంటారు. కేవలం అక్కడి స్థానికులే కాదు తెలంగాణ నుండి కూడా కేవలం ఈ కోళ్ల పందేల కోసమే వెళ్లేవారు చాలామంది ఉంటారు.  

 

అయితే మరో నెలలో సంక్రాంతి రానుంది. ఇక దీని కోసం ఎప్పటి నుంచో పందెం పుంజులని రెడీ చేసుకుని ఉన్నారు. ఇక మరికొందరు మంచి పందెం పుంజులని కొని సంక్రాంతి బరిలో సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే సంక్రాంతి దగ్గరకొస్తుండటంతో పందెం కోళ్ళ డిమాండ్ పెరిగింది. మామూలుగా పుంజులని కొనాలంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కోవాలి. కాకపోతే ఈ రోజుల్లో టెక్నాలజీ మరింత అందుబాటులోకి రావడంతో పందెం కోళ్ళు కూడా ఆన్ లైన్ లోకి వచ్చేశాయి.

 

సంక్రాంతికి ఇంకా నెల రోజులే సమయమే ఉండటంతో ఆన్లైన్‌లో పందెంకోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. ఆన్ లైన్ లో అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ విధంగా అమ్మకాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఏపీతో పాటు కేరళ, కర్నాటక, గోవాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఈ పందెం కోళ్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నారు.

 

ఇక పుంజు జాతిని బట్టి మంచి రేట్లు పలుకుతున్నాయి. జాతిని బట్టి ఒకో పుంజు రు. 5 వేల‌ నుంచి రూ.20 వేల వరకు అమ్ముతున్నారు. ఓ‌ఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేసి తమ ఫోన్‌ నెంబర్ల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారు.ఇక ఈ ఆన్ లైన్ వ్యాపారాలు కూడా బాగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: