వాళ్లను మాకు అప్పగించండి... ఏ శిక్ష విధించాలో..? దానిని ఎలా అమలు చేయాలో మేం చూసుకుంటాం? ఇదీ దిశ హంతకులపై దేశ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న ఆగ్రహం. ఇంతకీ ఈ దిశ ఎవరు? ఆమెకు ఆ పేరు ఎందుకొచ్చింది..? మన ఆలోచనా విధానం, పిల్లల పెంపకం దగ్గర నుంచి చట్టాలు... వాటిని అమలు చేసే తీరుపై దిశానిర్దేశం చేయడానికేనా ఆమెకు ఈ పేరు పెట్టింది..? 

 

దిశ అంటే దిక్కు... దిశ అంటే లక్ష్యం... దిశ అంటే గురి... మార్గం... అనే అర్థాలు కూడా ఉన్నాయి. చట్టాలు చేస్తే చాలదని... వాటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పకనే చెప్పింది దిశ ఘటన. అత్యాచార కేసుల్లో బాధితురాలి పేరును కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు గానీ, మీడియాగానీ వెల్లడించడానికి వీల్లేదు. ఆమె ఎవరో..? ఎక్కడ ఉంటున్నారో? ఏం చేస్తున్నారో? వంటి వివరాలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను కూడా బహిర్గతం చేయడానికి వీల్లేదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీలోని సెక్షన్‌ 228-ఏ ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లైంగిక దాడులు చేసిన నేరస్థులకంటే... బాధితులను నీచంగా చూస్తోంది మన సమాజం. అందువల్లే బాధితుల వివరాలు బహిర్గతం కాకుండా మరో పేరుతో వాళ్లను ప్రస్తావించే సంప్రదాయం కొనసాగుతోంది.  

 

పగలు-రాత్రి అనే తేడా లేకుండా నిత్యం వాహనాలు తిరిగే మార్గంలో దిశపై అఘాయిత్యం జరిగింది. శంషాబాద్‌ టోల్‌గేట్‌ నుంచి అడుగడుగునా సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంది. పెట్రోలింగ్‌ వాహనాలు తిరుగుతుంటాయి. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాల్ని స్పీడ్‌గన్స్‌తో గుర్తించి... నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఫైన్‌ విధించే అధునాతన టెక్నాలజీ వాడుతున్నారు.  కానీ... ఆ దుండగుల దురాగతం నుంచి మాత్రం ఆ అభాగ్యురాలిని ఎవరూ కాపాడలేకపోయారు. 

 

శంషాబాద్‌ టోల్‌గేట్‌ వద్ద జరిగిన ఘటనలో కూడా బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచాలని భావించారు పోలీసులు. నలుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బాధితురాలికి అప్పటికప్పుడు దిశ అనే పేరు పెట్టారు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌. అలాగే, బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారు సీపీ. దేశ రాజధానిలో 2012 డిసెంబర్‌లో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు... తర్వాత ఆమెను వాహనం నుంచి బయటకు నెట్టి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. అత్యాచార ఘటనల్లో బాధితులు, వారి బంధువుల వివరాలు గోప్యంగా ఉంచాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమెకు నిర్భయగా పేరు పెట్టారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం  కాకూడదనే ఉద్దేశంతో శిక్షలను కఠినతరం చేస్తూ... నిర్భయ చట్టం చేసింది ప్రభుత్వం. కానీ... మహిళలపై అఘాయిత్యాలను మాత్రం ఆపలేకపోతోంది ఆ చట్టం.  

 

నిర్భయ చట్టం చేసినా నేరాలు తగ్గకపోవడానికి కారణాలను అన్వేషించాలని చెబుతోంది దిశ ఘటన. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి..? కొత్త చట్టాలు చేయాలా..? లేక ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలా? అనే ప్రశ్నలకు తెరలేపింది దిశ. అలాగే, మనం పిల్లల్ని ఎలా పెంచాలి..? ఎలా పెంచుతున్నామని ప్రతి తల్లిదండ్రులు తమను తాము ప్రశ్నించుకునే చేసింది దిశ ఘటన. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టకపోతే... చిన్న వయస్సులోనే మద్యం వంటి దురలవాట్లకు బానిసలవుతారు... చివరికి వాళ్ల జీవితాలు ఏమౌతాయన్నది చెప్పడానికి  దిశ కేసులో నిందితులే ఓ ఉదాహరణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: