ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు పడిపోయాయి.  మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్‌ ప్రభుత్వం... తీసుకొచ్చిన కొత్త విధానం ఫలితమిస్తోందా? రానున్న రోజుల్లో అమ్మకాలు మరింత తగ్గనున్నాయా? సర్వేలు ఏం చెపుతున్నాయి.  

 

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానంతో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. లిక్కర్ రేట్లు భారీగా పెరగడంతో కొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఓ వైపు ధరల మోత... మరో వైపు తగ్గిన వైన్ షాపులు... పర్మిట్ రూమ్‌ల నిషేధం అన్నీ కలిసి మద్యం అమ్మకాలు బాగా తగ్గాయంటున్నారు అధికారులు. 2018 నవంబర్‌లో 29 లక్షల 62వేల కేసుల లిక్కర్‌ను విక్రయించగా.. ఈ ఏడాది నవంబర్‌లో 22 లక్షల 31 వేల కేసుల మద్యం మాత్రమే అమ్ముడయింది. అంటే 24 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. ఇక బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో 17 లక్షల 80 వేల కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది నవంబర్‌లో 8 లక్షల 13 వేల కేసులను మాత్రమే విక్రయించారు. దీంతో 54 శాతం బీర్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నూతన మద్యం పాలసీ అమల్ల్లోకి ఇచ్చిన తరువాత ఎనిమిది వందల వరకు వైన్స్ షాప్స్‌ని తొలగించడం కూడా మద్యం అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో 3 వేల 500 మద్యం దుకాణాలు ఉన్నాయి. 

 

అంతేకాకుండా మద్యం అమ్మకాల  సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేయడం.. ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడం మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణాలుగా చెప్పుకుంటున్నారు. ఇటు గ్రామాల్లోను గ్రామాల్లో బెల్ట్‌ షాపులను తొలగించడం కూడా మద్యం అమ్మకాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. 
మొత్తానికి దశల వారీగా మద్యపానం నిషేధాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: