ధరల పోటుతో డీలా పడిపోయిన సామాన్యుడికి మరో బ్యాడ్‌న్యూస్. నడ్డి విరగొడుగూ టిక్కెట్ ధరలు పెంచేసింది తెలంగాణ ఆర్టీసీ. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రగతి రథ చక్రానికి చికిత్స చేస్తున్నామనే సాకుతో ఛార్టీలను మునుపెన్నడూ లేని రీతిలో 20 శాతం పెంచేసింది యాజమాన్యం. 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఛార్జీలను పెంచేసింది ఆర్టీసీ. 2018-19 ఏడాదిలో ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోవడంతో.. చార్జీల భారం మోపడం తప్ప వేరే మార్గం లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో అన్ని సర్వీసులకు కిలోమీటర్ 20 పైసలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. 

 

పల్లె వెలుగు బస్సుల్లో గతంలో కనీస ఛార్జీలు ఆరు రూపాయలుంటే... ఇప్పుడది 10 రూపాయలకు పెరిగింది. పెరిగిన ఛార్జీలతో ప్రస్తుతమున్న పల్లెవెలుగు ఛార్జీలు కిలోమీటరుకు 63 పైసల నుంచి 83 పైసలు, సెమీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 75 పైసల నుంచి 95 పైసలకు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 98 పైసల నుంచి రూపాయి 7 పైసలుగా ఉన్నాయి. అలాగే, లగ్జరీ బస్సుల్లో  98 పైసల నుంచి రూపాయి 18 పైసలు, సూపర్ లగ్జరీలో రూపాయి 16 పైసల నుంచి రూపాయి 36 పైసలకు, రాజధాని, వజ్ర వంటి ఏసీ బస్సుల్లో రూపాయి 46 పైసల నుంచి రూపాయి 66 పైసలకు చార్జీలు పెరిగాయి. గరుడ ఏసీ బస్సుల్లో చార్జీలు రూపాయి 71 పైసల నుంచి రూపాయి 91 పైసలకు, గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో.. రూపాయి 82 పైసల నుంచి 2 రూపాయల 2 పైసలకు పెరిగాయి. అదే విధంగా, వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో 2 రూపాయల 53 పైసల నుంచి 2 రూపాయల 72 పైసలకు ఛార్జీలను పెంచింది ఆర్టీసీ యాజమాన్యం. 

 

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కూడా ఛార్జీల మోత మోగింది. రౌండింగ్ ధర 5 రూపాయలుగా కొనసాగించినా.. కనీస చార్జీని 5 రూపాయల నుంచి 10 రూపాయలకు, గరిష్ట ఛార్జీని 30 నుంచి 35 రూపాయలకు పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం కనీస ధరలో మార్పులు చేయకపోయినా... గరిష్ట ధర మాత్రం 5 రూపాయలు పెంచింది. మెట్రో డీలక్స్ కనీస చార్జీలు 10 రూపాయలు ఉండగా దాన్ని 15 రూపాయలకు, వీటి గరిష్ట ధరను 30 నుంచి 45 రూపాయలకు పెంచారు. 

 

బస్సు ఛార్జీలతో పాటు పాసుల రేట్లు కూడా భారీగానే పెరిగాయి. సాధారణ  నెలవారీ పాసుల ధరలు 770 రూపాయల నుంచి 950 రూపాయలకు పెరిగిపోయాయి. మెట్రో బస్సుల్లో నెలవారీ పాస్‌లు 880 నుంచి 1,070 రూపాయలకు, మెట్రో డీలక్స్ పాస్‌లు 990 రూపాయల నుంచి 1,185 రూపాయలకు పెరిగాయి. విద్యార్థుల రూట్ బస్‌పాస్‌ల 35 రూపాయల భారం మోపింది ఆర్టీసీ. ప్రస్తుతం రూట్‌ పాస్‌లను 4 కిలోమీటర్ల పరిధిలో 130 రూపాయలు ఉండగా దానిని 165 రూపాయలకు పెంచింది యాజమాన్యం. ఉన్నత పాఠశాల, కళాశాలకు సంబంధించిన నాలుగు నెలల పాస్‌లు 5 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం 235 రూపాయలు ఉండగా అదికాస్తా 310 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో విద్యార్థుల జనరల్ బస్‌పాస్ నెలవారీ చార్జీలు 130 నుంచి 165 రూపాయలకు పెరిగాయి. మరోవైపు 52 రోజులపాటు సమ్మెలో పాల్గొని కష్టాలు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చింది యాజమాన్యం. సెప్టెంబర్‌ జీతాన్ని కార్మికుల అకౌంట్‌లలో వేసింది. 

 

మొత్తం మీద.. మూలిగేనక్కపై తాటికాయ పడితే ఎలా ఉంటుందో.. ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకుడి పరిస్థితి అచ్చం అలాగే ఉంది. 52 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు, ఆటో వాలాలు సామాన్యుల్ని దారి దోపిడీ చేశారు. ఇప్పుడు ఛార్జీల మోతతో జేబుకు చిల్లు పెడుతుండడంతో విల్లవిల్లాడిపోతున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: