హైదరాబాద్ లో శంషాబాద్ లో దిశ అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా.. నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇప్పుడు దేశమంతా మౌనంగా రోదిస్తోంది. పశువైద్యురాలిగా మూగజీవాల వేదన తీర్చిన ఆమె ఇంత దారుణంగా హతమవ్వడం వారిని కలచివేస్తోంది. కామాంధుల కీచక కాండ దేశాన్నే నివ్వెర పరిచింది. ఇప్పుడు దిశ గాధ దేశమంతా మారుమోగుతోంది. ఇలాంటి మరో ఉదంతం జరగకుండా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ సైతం నినదిస్తోంది.

 

కానీ.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఓవైపు నిరసనలు తెలుపుతూనే దేశంలో చాలా మంది చేసిందేంటంటే.. దిశ రేప్ వీడియో ఎక్కడైనా దొరుకుతుందేమోనని గూగుల్ లో తెగ వెదికారట. ఈ విషయాన్ని గూగుల్, యూట్యూబ్ సంస్థలు చెబుతున్నాయి. గత రెండు రోజులుగా... ఈ వీడియో కోసం నెటిజన్లు బాగా వెదికారట. డిసెంబర్ 1, 2 తేదీల్లో రేప్ వీడియో, హైదరాబాద్ డెత్ ప్లేస్ ఫోటోస్, డాక్టర్ రేప్ అండ్ మర్డర్, హైదరాబాద్ గ్యాంగ్ రేప్ వీడియో అనే పదాలతో ఎక్కువ మంది సెర్చ్ చేసినట్టు ఓ సర్వేలో తేలిందట.

 

ఈ పచ్చినిజాలు భారతీయుల ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతున్నాయి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్న తరహాలో ఓ వైపు దిశ ఉదంతాన్ని ఖండిస్తూ వీధుల్లో లెక్చర్లు దంచుతూనే.. మొబైల్లో , కంప్యూటర్లలో మళ్లీ దిశ రేప్ వీడియోనే వెదుతుకున్న వైనం.. మన మస్తిస్కాల్లో పేరుకు పోయిన శాడిజానికి ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు.

 

దిశా హత్య కేసు నేపథ్యంలో ఇలాంటి దారుణాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏకంగా చట్టాలు మార్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అవసరమైతే కొత్త చట్టాలు కూడా తెస్తామని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. కానీ ఎన్ని శిక్షలు వేసినా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మానసిక రాక్షసుల నుంచి ఆడపిల్లలను కాపాడేదెవరు..?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: