ఇన్నాళ్లు అమ్మాయిల‌తో వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న ద్వారా వార్తల్లోకి ఎక్కిన స్వామి నిత్యానంద తాజాగా త‌న జ‌ల్సాల‌తో ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచారు. తనను తానే దేవుడిగా ప్ర‌క‌టించుకున్న నిత్యానంద‌ ఆరోప‌ణ‌లు రావ‌డంతో సామాన్యుడి వ‌లే విదేశాల‌కు పారిపోయాడు. స్వామి నిత్యానంద త‌మ‌ కూతుళ్లను త‌మ‌తో కలవనీయడం లేదంటూ గుజరాత్ హైకోర్టులో ఓ జంట పిటిషన్ వేయ‌డం, ఈ విష‌యంలో తీర్పు వెలువ‌రించ‌క‌ముందే ఆయ‌న విదేశాల‌కు పారిపోయిన‌ట్లు వార్త‌లు రావ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, ప్రైవేట్ దీవుల్లో నిత్యానందుడు ఉన్న‌ట్లు తేలింది. స్వామి నిత్యానందే స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాడ‌ని మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

బెంగళూరుకు చెందిన జనార్దన శర్మ, ఆయ‌న భార్య  వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం త‌మ నలుగురు కుమార్తెలను 2013లో స్వామి నిత్యానంద నడుపుతున్న ఒక విద్యాసంస్థలో చేర్పించారు. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఈ ఏడాది తమ కుమార్తెలను అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న నిత్యానంద ధ్యానపీఠానికి చెందిన సర్వగ్యపీఠానికి ఆ అమ్మాయిల‌ను మార్చార‌ట‌. అయితే వారు సర్వగ్యపీఠానికి వెళ్ల‌గా పీఠం బాధ్యులు వారి కుమార్తెలను కలవడానికి ఆ దంప‌తుల‌కు అనుమతి ఇవ్వలేద‌ట. దీంతో వారు పోలీసులను ఆశ్ర‌యించి వారి సహాయంతో తమ‌ ఇద్దరు మైనర్ కుమార్తెలను వెనకకు తీసుకురాగలిగారు. కానీ మేజ‌ర్ల‌యిన పెద్ద కుమార్తెలు లోపముద్ర (21) నందిత (18)లు మాత్రం అక్క‌డే ఉండిపోయారని, వారిని విడిపించాల‌ని కోరుతూ...కోర్టును ఆశ్ర‌యించారు. 

 

ఇలా హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే... వెస్టిండీస్ లో ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద‌ అక్కడే ఉంటున్నాడని తేలింది. ఇక్క‌డితోనే ఆయ‌న ప్ర‌త్యే`క‌థ‌లు` ముగిసిపోలేదు. ఆ దీవికి కైలాసదీవి అని పేరు పెట్టిన నిత్యానంద త‌న దీవి దేశం హోదా ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడ‌ట.  అంతేకాదు, ఆ దీవి కోసం ప్రత్యేక పాస్ పోర్ట్ ను కూడా రూపొందించాడ‌ట.  ఇండియాలో మాయమైన నిత్యానంద సొంత దీవిలో ఇలా జ‌ల్సా చేస్తున్న‌ట్లు వార్తలు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: