ఏపీలో మరి కొన్ని నెలలో పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జిల్లాలు జిల్లాలు క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార వైసీపీ ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తూనే ఉంది. తమ పాలనకు ఇవే కొలమానం కావడంతో సీఎం జగన్ వీటిని దృష్టిలో పెట్టుకునే పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేశారు. వీటితో పాటు ప్రజలకు ఉపయోగపడే పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

 

ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారు. కాబట్టి ఆయా ఎన్నికల్లో వైసీపీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే తమ పార్టీ వీక్ గా ఉన్న విశాఖ నగరంపై కూడా జగన్ దృష్టిపెట్టారు. త్వరలో అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. తాజాగా నగరంలో రవాణా, తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై ఆయన అధికారులతో చర్చించారు.

 

విశాఖపట్నం మెట్రోరైల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై సీఎం జగన్‌ చర్చించారు. 2020–2024 మధ్య విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. అలాగే విశాఖపట్నంలో రోడ్లు అన్నింటినీ బాగు చేయాలని, బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఈ విషయాలని పరిశీలిస్తే జగన్ విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని అర్ధమవుతుంది. ఎందుకంటే విశాఖలో వైసీపీ అంత బలంగా లేదు. మొన్న ఎన్నికల్లో నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లని టీడీపీనే గెలుచుకుంది.

 

దీంతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటి నుంచే నగరంలో బలపడాలి. అందుకే జగన్ స్పెషల్ గా ఫోకస్ పెట్టి విశాఖ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి కలిసొచ్చే అంశం ఏమిటంటే? టీడీపీ ఈస్ట్ స్థానం మినహా మిగతా మూడు చోట్ల ఇప్పుడు వీక్ అయిపోయింది. పైగా ఆ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తే వైసీపీ గెలుపు ఏకపక్షం కావడం ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: