అధికారంలో ఉన్నవారి అండదండలుంటే.. కొన్ని పదవులు ఇట్టే వరిస్తాయి. వాటిలో కొన్ని చాలా కీలకమైనవి కూడా ఉంటాయి. అలాంటిదే ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తికి ఈ పదవి కట్టబెట్టారు. ఇందుకు కేవలం సామాజిక వర్గ నేపథ్యమే కారణమన్న విమర్శలు వచ్చాయి. అయితే ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి అన్నది రాజ్యాంగ బద్ద పదవి. కాబట్టి అతడిని సులభంగా తొలగించే అవకాశం లేదు.

 

కానీ ఇప్పుడు అతడిని తొలగించాల్సిందే అన్న డిమాండ్లు వస్తున్నాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని ప్రోగ్రెస్సివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను ను కోరారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ఐదుగురు ఎమ్మెల్సీల బృందం ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. గడచిన నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు, ముఖాముఖిల్లో అనేక అకవతవకలు జరిగాయని గవర్నర్ కు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు.

 

ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. తరచూ సిలబస్ ను మార్చడం సహా పలు అక్రమాలు జరిగాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు వెంటనే ఆయన్ను తప్పించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడం సహా పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

అయితే ఉదయ్ భాస్కర్ ను పదవి నుంచి తొలగించడం అంత సులభం కాదు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అన్నది రాజ్యాంగ బద్ద పదవి.. ఒకసారి పదవిలో కూర్చోబెట్టాక తొలగించాలంటే చాలా సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. అందుకే సాధారణంగా ఈ పదవిలో ఉన్నవారి జోలికి ఎవరూ వెళ్లరు. మరి ఇప్పుడు జగన్ ఏంచేస్తారు.. అన్నది తేలాల్సిఉంది. జగన్ సీఎం అయిన మొదట్లోనే సచివాలయం ఉద్యోగాల పేపర్లు లీక్ అయ్యాయంటూ అప్రదిష్ట కూడా వచ్చిపడింది. అయినా జగన్ ఏపీపీఎస్సీ చైర్మన్ జోలికి వెళ్లలేదు. మరి ఇప్పుడు గవర్నర్ ను కలవడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: