దిశ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.. దేశ ప్రజల్లో ఆక్రోశం చల్లారడం లేదు. నిందితుల్ని వీలైనంత త్వరగా ఉరితీయాలని, ఇన్నిరోజులు రిమాండ్ లో ఎందుకు ఉంచారని ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూరులో కూడా మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. 

 

నినాదాలు ఆగలేదు. నిరసనలకు అలుపులేదు. దిశకు న్యాయం కావలసిందే.. దిశకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాల్సిందే. ఆవేశం, ఆవేదన ఆక్రోశం.. అన్నీ కలిసి మిన్నంటుతున్న గొంతుకలు జస్టిస్‌ ఫర్‌ దిశ అంటున్నాయి.  హైకోర్టు దగ్గర తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రస్తుత చట్టాలు మార్చాలని, నిందితుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనలో పోలీసుల తప్పు కూడా ఉందని, మొన్న చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడికి విధించిన ఉరిశిక్షను.. యావజ్జీవ శిక్షగా మార్చిన హైకోర్టు తీరును కూడా తప్పుబట్టారు లాయర్లు. 

 

దిశ ఘటనకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివాల్ జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షకు దిగారు. 
బేటీ బచావో.. బేటీ పఢావో అంటున్న కేంద్రం.. మొదట అమ్మాయిల్ని రక్షించాలని, అప్పుడే వారు చదువుకోగలుగుతారని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. మేం రిపబ్లిక్ లో ఉండాలనుకుంటున్నాం.. రేపిస్టుల మధ్య కాదని కూడా నినాదాలు చేశారు. 

 

బెంగళూరులో పశు వైద్యులు, వెటర్నరీ కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళన. చట్టాలు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన చేశారు. కఠినమైన శిక్షలు ఉంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయని అభిప్రాయం వినిపించింది. ఇంతవరకూ నిర్భయ నిందితులకు కూడా శిక్ష పడలేదని గుర్తుచేశారు. 

 

కర్ణాటక శివమొగ్గలో విశ్వహిందూ పరిషత్ మాతృమండలి నేతృత్వంలో ర్యాలీ తీశారు. దిశకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. నిన్న సోషల్‌మీడియాలో జస్టిస్‌ ఫర్‌ దిశపై  సామాజిక మాధ్యమాల్లో అనుచిత కామెంట్స్‌ చేసిన యువకుడి ఆటకట్టించారు పోలీసులు. స్టాలిన్‌ శ్రీరామ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు చేశాడు. ఆ యువకుడిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా  ఫకీరాబాద్‌కు చెందిన శ్రీరామ్‌ ఈ పోస్టింగ్‌లు పెట్టాడని నిర్ధారించుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై సుమోటో కేసును స్వీకరించారు ఖాకీలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: