తెలంగాణ రాష్ట్రంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు. సరైన తిండిలేక పౌష్టికాహార లోపంతో 69శాతం మంది పిల్లలు చనిపోతున్నారని యూనెసెఫ్ 2019 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక చూస్తే భయానక నిజాలను బయటపెట్టింది. పౌష్టికాహార లోపంతో  6నుంచి 23 నెలల్లోపు పిల్లలు 42శాతం మంది ఉండగా, 6 నుంచి 8నెలల్లోపు 52శాతం మంది పిల్లలు చనిపోతున్నారని వెల్లడించింది. అంతేకాకుండా గర్భస్థ శిశువుతో పాటు తల్లుల మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మూడు పూటలు పిల్లలకు సరిపడ తిండలేక న్యూమోనియాతో బాధపడుతూ 28.9శాతం పిల్లలు ప్రతి ఏటా చనిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతో శరీరంలో కాల్షియం, ఐరన్ లోపం వల్ల ప్రసవం కాకుండానే 32శాతం మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడం లేదని తెలిసింది. 

 

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మన రాష్ట్రంలో రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల ఆకలి చావులను నివారించవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది. కానీ రూపాయి కిలో బియ్యం పంపిణీ చేసినప్పటికీ వాటికి తోడు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. పైగా రాష్ట్రవ్యాప్తంగా 49శాతం మంది కుటుంబాలకు మూడు పూటల తిండి దొరకడం లేదని సమాచారం. ఒకవేళ దొరికిన అన్నం కారంపొడి వేసుకొని తింటున్నారని పలు అధ్యయన నివేదికల్లో బయటపడింది. దీంతో అయా కుటుంబాలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిసింది. 


   రాష్ట్రంలో  గర్భిణీ స్త్రీలతో పాటు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి కింద రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు నడుస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. వీటిలో 10,42,675 మంది ( 7నెలల నుంచి 3ఏళ్ల వరకూ పిల్లలు), 6,54,165 మంది (3నుంచి 6ఏళ్ల పిల్లలు), 4,31,310 మంది తల్లులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. కానీ అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా పిల్లలకు సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని తేలింది. చాలా వరకూ అంగన్ వాడీ కేంద్రాలు పెద్దగా నడవడం లేదని, ఈ కేంద్రాలకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లేదని పలువురు ఆరోపించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో మితిమీరిన అవినీతి ఉండడం వల్ల గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందక మృత్యువాత పడుతున్నారని తెలిసింది. 


 ఇదిలా ఉండగా ఆకలిచావులు, వలసల నివారణకు యూపిఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని 2005 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంత కూలీల వలసల నివారణ జరిగినప్పటికీ 100 రోజుల పనులతో పేదరిక నిర్మూలనను రూపుమాపడం కష్టమని తెలుస్తుంది. 100 రోజులు పని కల్పించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా 100 రోజులు ఖాళీగా ఉండే పరిస్థితులున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో గ్రామీణ కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో మరింత పేదరికంలో వెళ్లుతున్నట్లు పలు అధ్యయన సంస్థలు వెల్లడించాయి. దీన్నిబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలనకు పెద్దగా ఉపయోగకరంగా లేవని అర్థమౌతుంది. దీంతో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు మెరుగైన ఉపాధి అవకాశాలతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: