బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు,  కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్‌ఆర్‌సీ(జాతీయ పౌర జాజితా)ను దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజ్య‌స‌భ‌లో అమిత్‌షా ప్ర‌క‌టించారు. అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ఆర్‌సీ త‌ర‌హాలోనే అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. అయితే, పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ(నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌)ని అనుమతించబోమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీని బెంగాల్‌లో జరగనిచ్చేది లేదని మమతా బెనర్జీ సీఎం తేల్చి చెప్పారు. 

 

కాగా, కేంద్ర‌మంత్రి అమిత్ షా రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ...పౌరుల జాబితాలో ప్ర‌తి ఒక్క‌రూ ఉండే విధంగా ఎన్ఆర్‌సీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. వివిధ మ‌తాల‌కు చెందిన వారు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అస్సాంలో మ‌రో సారి ఎన్ఆర్‌సీ చేప‌డుతామ‌ని, వివిధ మ‌తాల‌కు చెందిన వారు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అస్సాంలో రిలీజైన సిటిజ‌న్స్ జాబితా నుంచి 19 ల‌క్ష‌ల మందిని త‌ప్పించిన విష‌యం తెలిసిందే. పేర్లు లేని వారు ట్రిబ్యున‌ల్‌కు వెళ్ల వ‌చ్చు అని ఆయ‌న వెల్ల‌డించారు. 

 

ఇదిలాఉండ‌గా, హోంమంత్రి అమిత్‌షా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో...సీఎం మమతా బెనర్జీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కుల, మతాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కేంద్రాన్ని పరోక్షంగా హెచ్చరించారు. కాగా, ఇటీవ‌లే ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ మాట్లాడుతూ.. అస్సాంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్‌ఆర్‌సీలో 19 లక్షల మందికి జాబితాలో చోటు దక్కలేదు. వారిలో అన్ని మతాల ప్రజలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు వారిని దేశం వదిలి వెళ్లాలంటే వారి పరిస్థితి ఏంటి..! అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. 76 సంవత్సరాల స్వతంత్య్ర భారత్‌లో జాతీయతను నిరూపించుకోవాల్సి రావడం మన దౌర్భాగ్యం అని ఆమె అన్నారు. `అస్సాంలో పోలీసు బలగాలతో ప్రజల్ని బెదిరించి మీరు చేసిన దౌర్జన్యం మా రాష్ట్రంలో చేయలేరు. ఇప్పటికిప్పుడు మాకు మీరు(బీజేపీ) మతాల గురించి, పండుగల గురించి తెలుపడం శోచనీయం. ఇంతకు ముందు దుర్గా పూజ, ఈద్‌, మొహర్రం, గణేష్‌ చతుర్థి లాంటి పండుగలు జరుపుకోలేమా?`` అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: