రోజు రోజుకు సమాజంలో చోటు చేసుకుంటున్న నికృష్టపు ఘటనలపై సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితమే ముందు చూపుతో మేథావులు ఆలోచించారు. ఇందుకు గాను ఆనాడే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తుల పట్ల చట్టాలు, సమాజంతో పాటు తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సిందని గుర్తు చేశారు. ఇకపోతే ప్రస్తుతం డాక్టర్‌ ప్రియాంకారెడ్డి ఉదంతం మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది.

 

 

మంచి ఆలోచన ఉన్నవారిలో ఆవేశాన్ని రగిలిస్తోంది. నిందితుల్ని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్లు కూడా వెల్లు వెత్తుతున్నాయి. అంతే కాకుండా వేలాదిమంది చేతికి దొరికితే చంపిపాతరేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీస్‌ బలగాలు కూడా ప్రజల ఆగ్రహం ముందు తలొంచక తప్పని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇదే కాదు దేశవ్యాప్తంగా గతకొన్నేళ్ళుగా ఇలాంటి అత్యాచార, హత్యోదంతాలు జరుగుతూనే ఉన్నాయి. నెలల పసిబిడ్డ నుంచి కాటికి కాళ్ళుచాపిన ముదుసళ్ళ వరకు కామ పిశాచాల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు.

 

 

తమ మానప్రాణాల్ని కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రోశిస్తున్నారు. నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో 2012లో ‘నిర్భయ’ను అత్యాచారం చేసి హత్యచేసిన వైనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమె పేరుమీదనే కేంద్రం ‘నిర్భయ’ చట్టం తెచ్చి ఆడపిల్లలకు రక్షణ సౌకర్యాలను కల్పించింది. ఈ నిర్భయ మరణం తర్వాత నుండి ఇప్పటివరకు అంటే సరిగ్గా 7 సంవత్సరాల నుండి కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.. అప్పటి నుండి తన కూతురు నిర్భయను అత్యాచారం చేసి చంపిన వారికి శిక్ష పడుతుందని ఏడు సంవత్సరాలుగా ఆమె తల్లి ఆశతో ఎదురుచూస్తోంది.

 

 

ఇక ఇప్పుడు తెలంగాణలో మరో ఆడకూతురు తన కూతురులాగానే మరణించడంపై నిర్భయ తల్లి ఆశాదేవీ తాజాగా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. మన వ్యవస్థలోని లోపాల వల్లే ఈ తరహా ఘటనలు పదేపదే ఉత్పన్నమవుతున్నాయని ఆమె కన్నీటితో తెలిపారు.

 

 

నేరస్థులు ఏ సమయంలోనైనా భయం లేకుండా తిరుగుతున్నారని విమర్శించారు. నిర్భయ కేసులో నేటికి న్యాయం జరగలేదని.. ఇప్పటికీ 7 సంవత్సరాలుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని కోర్టులు - చట్టాలు - నేరస్థులకు చుట్టాలుగా మారాయని.. నేరస్థులు ఎందుకు భయపడుతారని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: