తెలంగాణ రాష్ట్ర స‌మితి కీల‌క నేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడైన మంత్రి హ‌రీశ్ రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 
పార్టీలో ఎదురైన సంక్షోభాల‌ను ప‌రిష్క‌రించ‌డం ద్వారా ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందారు. హ‌రీశ్ రావు డైన‌మిజం, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పందించే తీరు చూసే... కేసీఆర్ వంటి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న నేత‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎంత కీల‌క పాత్ర పోషిస్తారో... త‌న‌ను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపిస్తున్న సిద్ధిపేటకు సైతం హ‌రీశ్ అంతే ప్రాధాన్యం ఇస్తారు. అలా తాజాగా ఓ రెండు ప్ర‌త్యేక‌త‌ల‌ను త‌న నియోజ‌క‌వ‌ర్గానికి హ‌రీశ్ రావు జోడించారు. 

 

స‌మాజంలో కీల‌క పాత్ర పోషించే రైతులు, విద్యార్థుల కోసం రెండు కీల‌క కార్య‌క్ర‌మాల‌కు హ‌రీశ్ రావు త‌న వంతు స‌హ‌కారం అందించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్‌ వారి సహకారంతో  టిఫిన్‌ - ట్యూషన్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఏర్పాటు చేయించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థినులందరికీ సాయంత్రం సమయంలో పాఠ‌శాల‌లోనే టిఫిన్ అంద‌జేస్తారు. మంగళవారం దీన్ని ప్రారంభించిన హ‌రీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థినులందరికీ సాయంత్రం సమయంలో టిఫిన్‌ - ట్యూషన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సాయంత్రం పాఠశాలలోనే టిఫిన్‌ చేసి.. చదువుకోవాలని చెప్పారు. పది ఫలితాల్లో సిద్దిపేట రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాలన్నారు.

 


మరోవైపు రైతుల విష‌యంలో హ‌రీశ్‌రావు త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు అందించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల‌ గ్రామంలో‌జరిగిన సేంద్రీయ, వ్యవసాయ రైతుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల వివరాలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వెబ్‌సైట్, ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... క్యాన్సర్‌వంటి వ్యాధులు‌ పెరుగుతుండటానికి కారణం మనం తీసుకునే కలుషిత ఆహారం నీరు, గాలి కారణమని చెప్పారు. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు‌ పండించడం వల్ల ‌క్యాన్సర్ కేసులు ‌ఎక్కువవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై మక్కువ ‌ఏర్పడిందన్నారు.  సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం https://siddipetorganicproducts.com/  వెబ్ సైట్ అందుబాటులో ఉంద‌ని, ఈ వెబ్ సైట్‌ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను దేశంలో ఏ మూల నుంచి అయినా కొనవచ్చన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: