పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో మాటలు త్రివిక్రం లాంటి వాళ్ళు రాయాలి. రాజకీయాల్లో మాత్రం ఆయన తనదైన శైల్లో పంచులు పేలుస్తున్నారు. బాంబులే వేస్తున్నారు. పవన్ మార్క్ పాలిటిక్స్ తో ఏపీలో  హల్ చల్ చేస్తున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా జగన్నే టార్గెట్ చేస్తూ వచ్చారు. తాజాగా పవనాలు రూటు మారినట్లున్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మీద కూడా ఆయన గట్టిగానే తగులుకున్నారు.

 

చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో 30 వేల కోట్ల రూపాయలు డబ్బు తీసి ఖర్చు పెట్టారంటూ పవన్ వదిలిన డైలాగు ఇపుడు ఏపీ రాజకీయాల్లో వాడి వేడి చర్చగా ఉంది. నిజానికి తాను ఎంతో కష్టపడ్డానని, తనను చూసి ఓటు వేయమని చంద్రబాబు చెప్పుకున్నారు. మరో వైపు ఏపీలో గత సర్కార్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని వైసీపీ నేతలే కాదు, అవినీతి మీద జాతీయ స్థాయిలో రేటింగ్ కట్టిన సంస్థలు కూడా నిగ్గు తేల్చాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇపుడు చేసిన హాట్ కామెంట్స్ తో టీడీపీ అవినీతి నిజమేననిపించేలాగుందని అంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లలో తన అభ్యర్ధులను నిలబెట్టిన టీడీపీ  వారి గెలుపు కోసం ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని పవన్ ఆరోపించడంతో ఇది పెద్ద దుమారాన్నే లేపేటట్టుగా కనిపిస్తోంది. బాబు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినా ఓడిపోయారంటూ పవన్ చేసిన ఈ కామెంట్స్ పసుపు శిబిరంలోనూ చర్చగా ఉన్నాయి.

 

పవన్ ఏ సందర్భంలో చేసినా కూడా ఇపుడు టీడీపీకి ఇవి గట్టిగా  గుచ్చుకునేలాగే ఉన్నాయని అంటున్నారు. ఇక మంగళగిరిలో లోకేష్ ఓటమిని తానే కారణమని కూడా పవన్ ప్రకటించడం మరో సంచలనం. తాను 2018 మార్చిలో అక్కడ మీటింగు పెట్టి టీడీపీ సర్కార్ భాగోతాన్ని మొత్తం చెప్పిక రోజునే ఆ పార్టీ ఓటమికి పునాది పడిపోయిందని పవన్ అన్నారు. ఏపీలో టీడీపీ ఫినిష్ అంటూ ఆ పార్టీతో తనకు లింకులు పెట్టడమేంటని కూడా పవన్ అన్నారని ప్రచారం సాగుతోంది.

 

మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇపుడు రెండవ వైపు చూస్తున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే చంద్రబాబునాయుడుకి కూడా ఇబ్బందికరమే. జగన్ అధికారంలో ఉన్నారు. పైగా జనాదరణతో నిన్ననే గెలిచి వచ్చారు. టీడీపీ పరిస్థితి అలా కాదు, ఏమైనా వ్యతిరేక కామెంట్స్ పవన్ చేస్తే మరింత ఇబ్బందిలో ఆ పార్టీ పడడం ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: