వైఎస్ జగన్ సర్కారు అన్ని వర్గాలనూ ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ క్రమంలో ఆయన హామీలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త హమీలకు తోడు గతంలో ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేశారు వైఎస్ జగన్.

 

అదేమింటంటే.. జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్‌ఆర్‌ లా నేస్తం’ పథకాన్ని జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అదే వేదికపై వైఎస్‌ఆర్‌ లా నేస్తం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు.

 

లా పూర్తి చేసిన వారు.. న్యాయవాద వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకాన్ని 2016 తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన వారికి వర్తింపజేస్తారు. ఈ మేరకు ఇప్పటికే విధివిధానాలు , మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దేశంలో ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. దేశంలో ఎక్కడా లేనివిధంగా జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్‌ ఇవ్వడంపై ముఖ్యమంత్రికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.

 

ఇదే సమయంలో వైఎస్ న్యాయవాదులకు మరో వరం ప్రకటించారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. దీంతో న్యాయవాదులు ఖుషీ అయ్యారు. వరాలు ఇవ్వడంలో వైఎస్ పెద్ద మనసు చాటుకుంటున్నారు. చేతికి ఎముక లేని విధంగా వరాల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపేజేస్తున్న ప్రశ్న. ఇందు కోసం తన వద్ద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయంటున్నారు జగన్.. చూడాలి ఎలా నిధులు తెస్తారో. ఏదేమైనా ఇచ్చిన మాట మాత్రం తప్పేది లేదంటున్నారు జగన్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: