మాజీ మంత్రి పొంగూరు నారాయణపై దాడి జరిగింది. విద్యాసంస్ధల్లో పెరిగిన ఫీజుల విషయంలో మాట్లాడుతున్నపుడు మాట మాట పెరగటంతో ఒక్కసారిగా గందరగోళం జరిగింది. ఈ నేపధ్యంలోనే నారాయణపై విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. ఈ దాడిలో మాజీ మంత్రి చొక్కా చిరిగిపోవటంతో పాటు ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు కూడా ధ్వంసం అయిపోయాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే చాలా కాలం తర్వాత నారాయణ అనంతపురంలో పర్యటించారు. పర్యటించారంటే పార్టీ వ్యవహారాల మీద కాదులేండి. విద్యాసంస్ధల అధిపతి కూడా అయిన నారాయణ అదే పనిమీద అనంతపురంకు వచ్చారు. మాజీ మంత్రి వస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాల నేతలు ఆయనతో మాట్లాడేందుకు వచ్చారు. సరే మాజీ మంత్రిని కలిసిన తర్వాత తమ డిమాండ్లేవో వాళ్ళు చెప్పారు.

 

విద్యాసంస్ధల్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని అందరూ కట్టలేకపోతున్నట్లు ఫిర్యాదులు చేశారు. వాళ్ళు తనను కలుస్తున్న విషయాన్ని ముందే గ్రహించిన నారాయణ వాళ్ళ డిమాండ్లపై పెద్దగా స్పందించలేదట. వాళ్ళ డిమాండ్లపై ఏదో మొక్కుబడిగా మాట్లాడేసి వెళ్ళిపొమ్మన్నారట. దాంతో తమకు సరైన హామీ ఇవ్వాల్సిందేనంటూ విద్యార్ధులు గట్టిగా పట్టుబట్టారు. ఎప్పుడైతే పరిస్ధితి అదుపు తప్పుతోందని అనుకున్నారో వెంటనే నారాయణ మనషులు విద్యార్ధులను దూరంగా నెట్టేశారని సమాచారం.

 

ఈ నేపధ్యంలోనే ఇటు విద్యార్ధులకు అటు నారాయణ మనుషులకు మధ్య తోపులాట జరిగింది.  ఈ తోపులాటలో కొందరు విద్యార్ధుల మాజీమంత్రి మీద పడ్డారట. నారాయణకు దేహశుద్ది కూడా జరిగిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద మాజీమంత్రి చొక్కా చిరిగిపోవటంతో పాటు కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. నిజానికి నారాయణ మీద చాలాకాలంగా విద్యార్ధులు మండిపోతున్నారు.

 

అధికారంలో చేతిలో ఉంది కాబట్టి ఫీజుల విషయంలో తనిష్టప్రకారం నడుచుకున్నా ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు.  తాను మంత్రి అవ్వటమే కాకుండా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయానా తన వియ్యంకుడే కావటంతో నారాయణకు ఆకాశమే హద్దుగా ఉండేది. ఇపుడు అధికారం పోయింది కదా అందుకనే విద్యార్ధుల మధ్యలో దొరికిపోయారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: