దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న దిశ హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అత్యంత అమానుష రీతిలో రాక్ష‌స‌త్వంతో ప్ర‌వ‌ర్తించిన నిందితులు ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జైల్లో ఉన్న‌ప్ప‌టికీ నిందితుల తీరులో ఏ మార్పు రాలేద‌ని తెలుస్తోంది. జైలు సిబ్బంది వారిని కలిసిన‌ప్పుడు ఎలాంటి ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయ‌లేద‌ని స‌మాచారం. మ‌రోవైపు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గాల‌ను సైతం నిందితులు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

 

చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ఉన్న నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ షాద్‌నగర్ కోర్టులో పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే,దేశవ్యాప్తంగా నిందితులపై అగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పక్కావ్యూహంతో విచారణ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే కస్టడీ తీసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి విషయంపై వివరాలు వెల్లడించేందుకు సెక్యూరిటీ కారణాలు చూపుతూ తామేమీ చెప్పలేమంటూ పోలీసులు పేర్కొంటున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, కోర్టు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ.... ప్రజాగ్రహం నేపథ్యంలో నిందితుల తరలింపు పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. దీంతో వారిని జైలులోనే విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 

 


ఇదిలాఉండ‌గా, మరోవైపు నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. షాద్‌నగర్ కోర్టు న్యాయమూర్తి నిందితులకు నోటీసులు జారీచేసినట్టు సమాచారం. నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకుం టే జైలులోనే విచారించాలా? లేదా రహస్య ప్రాం తానికి తీసుకెళ్లాలా అనే అంశంపై పోలీసులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. నిందితులపై చార్జిషీట్ తయారుచేసేందుకు అనుభవజ్ఞులైన అధికారులతో పన్నెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు తెలిసింది. నిందితులు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా ప్రతి ఆధారాన్ని నిరూపించేలా చార్జిషీట్‌ను తయారుచేస్తున్నారు. దర్యాప్తు విషయాలను బయటకు లీక్‌కాకుండా ఉన్నతాధికారులు సీరియస్‌గా హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. దీంతో దిశ విచారణలో మీడియాకు ఎలాంటి విషయాన్ని చెప్పకుండా పోలీసులు అంతా గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: