వైసిపితో తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు టచ్ లో ఉన్నారనే వార్త సంచలనం రేకెత్తిస్తోంది. కొందరు ఎంఎల్ఏలు టిడిపికి రాజీనామా చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు స్వయంగా చేసిన దీక్షల్లో కూడా కొందరు ఎంఎల్ఏలు పాల్గొనటం లేదు. దాంతో ఎంఎల్ఏలు మారిపోతున్నారనే ప్రచారానికి ఊతమొస్తోంది.

 

ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని ముగ్గురు ఎంఎల్ఏలు మంత్రులతో చర్చలు జరిపారని ఎల్లోమీడియానే ప్రముఖంగా కథనాన్ని అందించింది. దాంతో ఈ విషయం పార్టీలో సంచలనంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు ప్రకాశం జిల్లాలోనే ఉన్నారు.

 

వీరిలో చీరాలలో కరణం బలరామ్, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరు సాంబశివరావు, కొండెపిలో బాల వీరాంజనేయస్వామి గెలిచారు. వీరిలో కొండెపి ఎంఎల్ఏ తప్ప మిగిలిన ముగ్గురు వైసిపితో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు.  మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో గొట్టిపాటి, కరణం హాజరైన విషయం అందరూ చూసిందే. అలాగే మరో ఎంఎల్ఏ ఏలూరు మంత్రి కొడాలినానితో టచ్ లో ఉన్నారట.

 

వీళ్ళ ముగ్గురు బహిరంగంగానే వైసిపి ప్రజాప్రతినిధులతో టచ్ లో ఉన్నారు. ఆమధ్య ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకల్లో కరణం హాజరవ్వటం పార్టీలో కూడా చర్చ జరిగింది. నిజానికి మంత్రులు, అధికారపార్టీ ఎంపి, ఎంఎల్ఏల పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వటం తప్పేమీ కాకపోయినా సొంతపార్టీలో అనుమానాలకు తావిస్తుందన్నది వాస్తవం.

 

పై ముగ్గురు ఎంఎల్ఏలు మంత్రులతో టచ్ లో ఉన్నారని తెలియగానే చంద్రబాబునాయుడు కూడా వీళ్ళతో చాలా సేపు ఫోన్ లో మాట్లాడారట. మరి వాళ్ళ మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందన్నది ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి టిడిపి ఎంఎల్ఏలు మంత్రులతో టచ్ లో ఉన్నారన్న విషయం చంద్రబాబులో టెన్షన్ పెంచుతోందన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికే వల్లభనేని వంశీతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు తాజాగా ఈ ముగ్గురి వ్యవహారం మరిన్ని తలనొప్పులు తేవటం ఖాయమే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: