కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఈరోజు చిదంబరంకు బెయిల్ మంజూరు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఈడీ నమోదు చేసిన కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. కోర్టు రెండు లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది. 
 
ఈరోజు ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, భానుమతి, బోపన్నలతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. చిదంబరానికి 105 రోజుల జైలు జీవితం తరువాత బెయిల్ దొరికింది. చిదంబరం బెయిల్ పై విడుదలవుతున్న సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉండటం గమనార్హం. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ చిదంబరానికి పలు సూచనలు చేసింది. 
 
చిదంబరం కేసుకు సంబంధించిన ప్రెస్ ఇంటర్వ్యూలను కానీ, సాక్ష్యులను ప్రభావితం చేయడం కానీ, సాక్ష్యాలను నీరుగార్చడం కానీ, బహిరంగ ప్రకటనలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గత నెలలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. చిదంబరంపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అందువలన బెయిల్ ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. 
 
చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈడీ, చిదంబరం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గత నెల 28వ తేదీన ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చిదంబరం విదేశీ పాస్ పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు చిదంబరం వెళ్లరాదని పేర్కొంది. సీబీఐ 2017 మేలో చిదంబరంపై అవినీతి కేసు నమోదు చేసింది. 2017 చివర్లో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అక్టోబర్ 16వ తేదీన మనీ లాండరింగ్ కేసులో ఈడీ చిదంబరంను అరెస్ట్ చేయగా చిదంబరం ఇంతకాలం తీహార్ జైలులో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: