రైల్వే ఉద్యోగాల విషయంలో తెలుగు రాష్ట్రాలు దారుణ అన్యాయానికి గురవుతున్నాయి. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌లో 4,103 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ పోస్టుల్లో దరఖాస్తు చేసుకునేందుకు దేశవ్యాప్తంగా అందరికీ అవకాశం కల్పించారు. కానీ..ఇలాంటి ఉద్యోగాలు మిగిలిన జోన్లలో పడితే మాత్రం తెలుగు వారు రాసుకునే అవకాశం లేదు. ఆ జోన్లలో మాత్రం స్థానికులకే అవకాశం కల్పిస్తున్నారు.

 

దీంతో రైల్వే అప్రెంటిస్‌షిప్‌లో తెలుగువారికి అన్యాయం జరుగుతోంది. దీనిపై తెలుగు అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్లీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తే ఉద్యోగం సాధించడానికి ఛాన్స్ పెరుగుతుంది. రైల్వేశాఖ చేపట్టే గ్రూప్‌-డి నియామకాల్లో 20 శాతం పోస్టులు ఇక్కడ అప్రెంటిస్‌షిప్‌ చేసిన వారికి వస్తుంటాయి.

 

వీటి ఎంపికలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనుసరిస్తున్న విధానం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అన్యాయం మిగులుస్తోంది. ఇతర రైల్వే జోన్లు స్థానికుల ప్రయోజనాలను పరిరక్షిస్తున్నాయి. కానీ సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తోంది. చెన్నై కేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే అప్రెంటిస్‌షిప్‌ల భర్తీకి డిసెంబరు 1 నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. అక్కడ మాత్రం జోన్‌ భౌగోళిక ప్రాంతం పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని రూల్ ఉంది.

 

ఈ రూల్ వల్ల ఏపీ, తెలంగాణ వాళ్ల అక్కడ పరీక్ష రాసే అవకాశం లేదు. ఈ వివక్ష గురించి నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఇదే విషయమై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇటీవల లేఖ రాసారు. కానీ కేంద్రం స్పందించలేదు. కనీసం తెలుగు రాష్ట్రాల పరిధిలోని ఎంపీలు రైల్వే శాఖపై ఒత్తిడి తెస్తే ప్రస్తుత ప్రకటనను రద్దు చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: