నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం...వైసీపీలో చిచ్చు రేపుతోంది. రాజ‌కీయ అవ‌కాశాలు ద‌క్క‌ని వారికి అధికార పార్టీ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను కేటాయించ‌డం స‌హ‌జ‌మే. అయితే ఇందులోనూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయని..పార్టీని ఏళ్లుగా ప‌ట్టుకుని ప‌ని చేసిన‌వారికి కాకుండా రెక‌మెండేష‌న్లు..కొత్త‌గా వ‌చ్చిన‌వారికి వెంట‌నే ప‌ద‌వులిచ్చే ప‌ద్ధ‌తి ఏమాత్రం బాగోలేద‌ని వైసీపీ శ్రేణుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.  ఈ ధిక్కార స్వ‌రం కాస్త క‌ర్నూలులో ఎక్కువ‌గానే వినిపిస్తోంది.

 

జిల్లాలో ఇటీవ‌లే కొన్ని నామినేటేడ్ పోస్టులు భ‌ర్తీ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ విద్యాల‌యం పాల‌క‌మండ‌లి వ‌ర్గ స‌భ్యుడిగా నంద్యాల‌కు చెందిన పారిశ్రామిక వేత్త రామ్మోహన్ రెడ్డిని నియ‌మించ‌డం వివాదాస్పందంగా మారింది. పార్టీ శ్రేణుల మధ్య చీలిక‌ను తెస్తోంది.  పార్టీకి ఏమాత్రం ప‌నిచేయ‌క‌పోగా... అనేక ఏళ్లు వైఎస్సార్ విమ‌ర్శించి పబ్బం గ‌డుపుకున్నారు.. అలాంటి రామ్మోహ‌న్‌రెడ్డికి పిలిచి మ‌రీ ప‌ద‌వి ఇవ్వ‌డం ఏంట‌ని శ్రేణులు నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తున్నాయ‌ట‌.  జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే టాపిక్పై హాట్ హాట్‌గా చ‌ర్చ సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

వాస్త‌వానికి రామ్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ ఎస్పీవైరెడ్డి అన్న చుట్ట‌రెడ్డి అల్లుడు. పార్టీలో కొన‌సాగుతున్నాడ‌నే పేరే గాని 2014, 2019 ఎన్నికల్లో ఎక్కడా ఒకరోజు ప్రచారంలో కానీ, జెండా కట్టి తిరగటం ఎవరూ చూడలేదని కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శిస్తున్నారు. పైగా ఆయ‌న‌పై  బ్యాంకులు, ఇతర సంస్థలకు అప్పులు ఎగొట్టిన కోర్టు కేసులున్నాయ‌ని గుర్తు చేస్తున్నారు. కొన్ని వందల మందిని ఆర్థికంగా ముంచేసిన ఘ‌న చ‌రిత్ర ఆయ‌న‌ద‌ని మండిప‌డుతున్నార‌ట‌. అలాంటి వ్య‌క్తికి ఇప్పుడు ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని స్థానిక నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారట.

 

ప్రభుత్వమన్నాక నియమాకాలలో కొన్ని ఒత్తిడులు ఉండటం సహజమే  కాని  మ‌రీ ఇలా అడ్డ‌దిడ్డంగా పార్టీలో చేరి కొన‌సాగుతూ... ప‌ద‌వుల కోసం వెంప‌ర్లాడే వారికి కేటాయింపులు చేస్తే క‌ష్ట‌ప‌డ్డ వాళ్లు ఏం కావాల‌ని నిల‌దీస్తున్నార‌ట‌. ఎమ్మెల్యే నో మరొకరో రెకమెండ్ చేసినంత మాత్రాన ఎవరికంటే వారికి పదవులు ఇవ్వటమేనా? నంద్యాలలో మొదటి పదవి రాజగోపాల్ రెడ్డి కి దక్కాలి క‌దా..?! అంటూ ఆయ‌న‌కు ప‌లువురు కార్య‌క‌ర్త‌లు అండ‌గా నిలుస్తున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: