జేసిలకు జిల్లా పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు. జేసి బ్రదర్స్ కు తెరవెనుక నుండి అసాంఘీక కార్యకలాపాల్లో  అందడండలందిస్తున్న ఎస్వీ రవీంద్రారెడ్డిని జిల్లా నుండి బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. గడచిన పదిహేనేళ్ళల్లో జేసి బ్రదర్స్ పేరుతో జరిగిన చాలా అరాచకాల్లో రవీంద్రారెడ్డిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు.

 

పొట్టి రవిగా పాపులరైన రవీంద్రారెడ్డి తాడిపత్రి కేంద్రంగా చాలా అరాచకాలే చేశారని పోలీసులు అంటున్నారు. 2003లో జేసి పంచన చేరిన పొట్టిరవి సోదరుల అండతో వాళ్ళ ప్రత్యర్ధులపై  చెలరేగిపోయేవాడు.  మాజీ ఎంపి, మాజీ ఎంఎల్ఏ జేసి దివాకర్ రెడ్డి, జేసి ప్రభాకర్ రెడ్డి ఇద్దరికీ సన్నిహితుడుగా మారటంతో సోదరులే పొట్టి రవిని కాపాడుకుంటున్నారు ఇంతకాలం.

 

పొట్టి రవిపై హత్యాయత్నాలు, దొమ్మీలు, మారణాయుధాలు కలిగుండటం లాంటి అనేక వ్యవహారాలపై 11 కేసులున్నాయి.  2015లో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన కేసు,  2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమంకు చెందిన వాటర్ ట్యాంకు ధ్వంసం కేసు కూడా రవిపై ఉంది. అలాగే 2018లో వినాయక నిమ్మజ్జనం సందర్భంగా జరిగిన విధ్వసం ఘటనల్లో  మారణాయుధాలు కలిగి ఉన్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

జేసి సోదరుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పార్టీలోని ఇతర నేతలు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరూ రవి జోలికి వెళ్ళలేకపోయారు. ప్రభుత్వం మారినా పొట్టి రవి తన పంథాను మార్చుకోలేదని పోలీసులు గుర్తించారు. తాడిపత్రి కేంద్రంగా రవి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలను  పోలీసులు ఇపుడు సీరియస్ గా తీసుకున్నారు. అందుకనే సమీక్ష జరిపిన తర్వాత పొట్టి రవి పై జిల్లా బహిష్కరణకు రంగం సిద్ధమైంది. స్ధానిక ఎన్నికలకు ముందు ప్రధాన అనుచరుడిపై పోలీసులు జిల్లా బహిష్కరణ అస్త్రం వేయాలని నిర్ణయించటమంటే జేసిలకు పెద్ద షాకనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: