అకాల వర్షాలు తమిళనాడును నిండా ముంచేశాయి. తీవ్ర పంట నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో 25 మంది చనిపోగా.... వందలాది మంది రిలీఫ్ కేంద్రాల్లోనే ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

 

భారీ వర్షాలతో తమిళనాడు చిగురుటాకులా వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఐదురోజులుగా భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని షోజింగానల్లూర్‌, పల్లవరం, తంబారం, నన్‌ మంగళం, సెలియాయూర్‌ ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది. ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలువులు ప్రకటించిన ప్రభుత్వం.. మద్రాస్‌, అన్నా యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేసింది.

 

మరో ఆరు జిల్లాల్లో రెడ్‌ అర్ట్‌ కొనసాగుతోంది. తిరువల్లూర్‌, వెల్లూర్‌, తిరువన్నమలై, తూత్తుకూడి, రామనాథపురం, తిరునెల్వేలి జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కడలూరు, నాగపట్నం, తూత్తుకూడి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది. వందలాది ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. వరదలతో ఇప్పటికే 25 మంది చనిపోయారు. 

 

కడలూరులో వేలారు నది పొంగి ప్రవహిస్తుంది. ప్రవాహం దాటికి ఓ వంతెన తెగిపోయింది. దీంతో పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామనాథపురం, అరియలూర్‌, శివగింగై, పెరంబలూర్‌, పుదుకొట్టే జిల్లాల్లో వర్షం భారీగా కురిసింది. మెట్టుపాళ్యంలో అత్యధికంగా 18 సెం.మీల వర్షపాతం నమోదైంది.

 

మరోవైపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 176 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఫైర్‌, రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్యుటికోరిన్, కుద్దలూర్, తిరునెవెల్లి జిల్లాల్లో వెయ్యిమందికిపైగా రిలీఫ్ కేంద్రాల్లో ఉన్నారు. కడలూరులో 5వేల ఇళ్లు నీట మునిగాయి. దీంతో బాధితుల కోసం ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో రిలీఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో 24 గంటలపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెల్పింది భారత వాతావరణశాఖ. అధికారులు, ప్రజలను అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: