మత్తు పదార్ధాలు అమరావతిని చుట్టుముట్టేస్తున్నాయి. ఒకవైపు గంజాయి... మరో వైపున సింథటిక్ డ్రగ్స్... యువతను మత్తులోకి లాగుతున్నాయి. విద్యార్థుల ముసుగులో విదేశీయులు డ్రగ్ మాఫియాను నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహరం రాజధాని ప్రాంతంలో పోలీసులకు సవాల్‌గా మారింది. 

 

రాజధాని ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా ముఠాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. మత్తుకు అలవాటు పడిన యువతను సింథటిక్ డ్రగ్స్‌ శాసిస్తున్నాయి. LSD వంటి గ్రడ్స్‌ను బెంగుళూరు నుంచి తిరుపతి మీదుగా అమరావతికి తీసుకొస్తున్నారు. చిన్నక్లూతో రంగంలోకి దిగిన పోలీసులు... మొత్తం ముఠా గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు. విదేశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ తీసుకున్నారు. అయితే క్లాసులకు వెళ్లకుండా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. బెంగుళూరు నుంచి అమరావతికి డ్రగ్స్‌ వస్తున్నట్టు గుర్తించారు. 

 

నిందితుల వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉన్నట్టు తేలింది. చదువు పేరుతో ఇండియాకు వచ్చి... రాజధాని ప్రాంతంలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. స్టూడెంట్స్‌లా తిరుగుతూ... పరిచయాలు పెంచుకుని... యువతకు మత్తు పదార్థాలను చేరవేస్తున్నారు. ఒక గ్రాము సింథటిక్ మాదకద్రవ్యాల ధర 2 వేల రూపాయలు పైమాటే.  ఇంకాస్త ఘాటుగా ఉండాలంటే నాలుగు వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. డ్రగ్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత. దీంతో ఈ వ్యవహరంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీసులు. డ్రగ్ మాఫియా వెనుక ఎవరున్నారు. బెంగుళూరు నుండే కాకుండా మరెక్కడి నుంచైనా రాజధానిలోకి డ్రగ్స్‌ ప్రవేశిస్తున్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.  

 

మొత్తానికి డ్రగ్స్ మాఫియా అమరావతిలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్స్ ముఠా తమ దందాను యథేచ్చగా జరిపేందుకు విద్యార్థులనే ఎరగా వాడుతున్నారు. స్టూడెంట్స్ ద్వారా తమ అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ ముఠా వలలో చిక్కకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను తగు జాగ్రత్త వహించాలని పోలీసులు సైతం కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: