ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్క‌డ నుంచి అప్ర‌తిహ‌త విజ‌యం సాధించి రెండో సారి కూడా త‌న‌కు తిరుగేలేద‌ని నిరూపించుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు పార్టీ మారుతు న్నార‌ని, అధికార పార్టీకి అనుకూలంగా మారుతున్నార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ ప్ర‌చారం వెనుక వైసీపీ నాయ‌కులు ఉన్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. స‌రే! ఈ ప్ర‌చారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లు ఏలూరికి పార్టీ మారాల్సిన అవ‌స‌రం ఏంటి ? ఆయ‌న‌కు టీడీపీలో అనుబంధం ఎలా ఉంది ?  పార్టీలో ఆయ‌న‌కు నిజంగానే గుర్తింపు లేదా ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఆస‌క్తికర విష‌యాలు క‌నిపిస్తాయి.



ఇప్ప‌టికే ఇదే జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మార‌డం లేదా టీడీపీకి దూరం అవ్వ‌డం ఖ‌రారైంది. ఇక ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆనుకుని ఉన్న ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గానికి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం. గ‌తంలో ఆయ‌న ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడిగా ఇక్క‌డ గుర్తింపు సాదించారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి 2014లో పోటీ చేసిన ఏలూరి త‌న స‌త్తా చాటారు. గెలుపు గుర్రం ఎక్కారు.



తొలి ప్ర‌య‌త్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరు ఐదేళ్లు ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే మార్గాలు అన్వేషించారు. రోడ్లు వేయించారు. సాగు నీటి క‌ల్ప‌న ప్రాధాన్యం ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో నేరుగా మాట్లాడి ని ధులు తెప్పించుకున్నారు. ఇక‌, త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఎలాంటి వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇప్పుడు ఇదే జిల్లాలోని గొట్టిపాటి, క‌ర‌ణం పార్టీ మారుతోన్న నేప‌థ్యంలో ఏలూరుపై సైతం ఇదే సందేహాలు వ‌స్తున్నాయి.



అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఏలూరు కోసం కూడా వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆయ‌న మాత్రం పార్టీ మార‌న‌ని ఖ‌రాఖండీగా తేల్చి చెప్పేశార‌ట‌. చంద్ర‌బాబుపై ప‌దే ప‌దే విరుచుకు ప‌డే ఓ మంత్రి ఏలూరు కోసం విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేయ‌గా ఆయ‌న మాత్రం నో చెప్పార‌ట‌. త‌న‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చిన టీడీపీ, చంద్ర‌బాబును తాను ఎప్ప‌ట‌కీ వ‌దిలేది లేద‌ని ఆయ‌న చెప్ప‌డంతో చివ‌ర‌కు జిల్లాలో టీడీపీని ఎలాగైనా దెబ్బ కొట్టాల‌న్న టార్గెట్‌తో వైసీపీ నేత‌లు క‌ర‌ణం, గొట్టిపాటి విష‌యంలో స‌క్సెస్ అయిన‌ట్టు టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: