ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ టెండరింగ్ సూపర్‌ సక్సెస్‌ అవుతోంది. పోలవరం ప్రాజెక్టులో భారీగా ప్రజాధనాన్ని ఆదా చేసిన రివర్స్ టెండరింగ్‌.... ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలులోనూ దుబారాను కంట్రోల్‌ చేసింది. మొత్తం 83 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనం ఆదా అయినట్టు చెబుతోంది ఏపీ ప్రభుత్వం. 

 

ఏపీలో రివర్స్ టెండరింగ్ మరోసారి సత్ఫలితాలిచ్చింది. గ్రామ, వార్డు వలంటీర్ల కోసం కొన్న స్మార్ట్‌ ఫోన్ల విషయంలో భారీగా ఆదా చేసింది. గ్రామ, వార్డు వలంటీర్ల కోసం 2 లక్షల 64 వేల 920 స్మార్ట్ ఫోన్లు కొనాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. నవంబర్‌ 30న ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ బిడ్‌లను ఆహ్వానించింది. దీంతో ఎల్‌-1గా నిలిచిన కంపెనీ 317 కోట్ల 61 లక్షల రూపాయలకు కోట్‌ చేసింది. దీనిపై మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఈ సారి అదే కంపెనీ 233 కోట్ల 81 లక్షల రూపాయలకు కోట్‌ చేసి బిడ్‌‌ను దక్కించుకుంది. అంటే తొలి దశ బిడ్డింగ్‌ కన్నా 83 కోట్ల 8 లక్షల రూపాయలు తక్కువకు మొబైల్‌ ఫోన్లను అందజేయడానికి ముందుకొచ్చింది ఆ కంపెనీ. 

 

3 జీబీ ర్యాం, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ గల ఈ ఫోన్లకు ఏడాది పాటు వారెంటీ ఇస్తోంది కంపెనీ. టైప్‌ సి లేదా మైక్రో యూఎస్‌బీ టూ, మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టాంపర్డ్‌ గ్లాస్, బ్యాక్ కవర్ అందజేసే ఈ ఫోన్లకు మూడేళ్ల పాటు మాస్టర్‌ డేటా మేనేజ్‌మెంట్ అందిస్తుంది ప్రభుత్వం. మెయింటినెన్స్‌తో పాటు వాకిన్‌ సపోర్ట్‌ అందించేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందాల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న రివర్స్ టెండరింగ్‌ స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలు ద్వారా మరో సారి బిగ్‌ హిట్‌ అయిదంటోంది ఏపీ సర్కార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: