ఎంతో దూరం ప్రయాణం చేసి తమ పుట్టింటికి చేరే జీవుల కోసం డీఆర్‌డీవో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏకంగా మిస్సైల్ టెస్టింగ్ సెంటర్లో మార్పులు చేసింది. ఇంతకీ అంత ప్రత్యేక అతిథులు ఎవరో తెలుసా ఆలీవ్‌ రిడ్లీ తాబేళ్లు..

 

ఒడిశాలోని గహిరమత తీరప్రాంత సంరక్షణ కేంద్రంలోని నాసి-1, నాసి-2 దీవులకు సమీప దీవుల్లో ఆలీవ్‌ రిడ్లీ తాబేళ్లు ఏటా ఈ సీజన్‌లో వచ్చి గుడ్లు పెట్టి.. తమ సంతతిని పెంచుకొంటాయి. ఆలీవ్‌ రిడ్లీ తాబేళ్లలో 50 శాతానికి ఒడిశా తీరప్రాంతమే పుట్టిల్లు. రుషికుల్యా నది సమీపంలోకి కూడా ఇవి వస్తుంటాయి. ప్రభుత్వం వాటికి  ఏమాత్రం ఇబ్బంది లేకుండా  తక్కువగా రోడ్లు, గుడిసెలు, గుడారాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది. గహిరమాత తీర సంరక్షణ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఈ తాబేళ్లు వచ్చి గుడ్లుపెడతాయి.

 

ఇక్కడే డీఆర్‌డీవోకు మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ఉంది. రాత్రి వేళల్లో శక్తిమంతమైన లైట్లు వేసి ఉండటంతో ఆడ తాబేళ్లు తమ దిశను మార్చుకుంటున్నాయి. పైపెచ్చు ప్రమాదకరమైన క్షిపణి పరీక్షా కేంద్రం వైపు వచ్చేస్తుండటంతో సిబ్బందికి తలనొప్పిగా మారింది. అరుదైన ఈ తాబేళ్ల పునరుత్పత్తికి ఆటంకం కలుగుతుందని భావించిన డీఆర్‌డీవో అధికారులు ..సంరక్షణ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. తాబేళ్లకు ఆహ్లదంగా ఉండేలా అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‌లో.. ప్రత్యేకించి రాత్రివేళల్లో లైటింగ్ తగ్గించేశారు. దాంతోపాటు ఇక్కడే ఉన్న పారాదీప్‌ పోర్టు, ధమర పోర్టులోనూ కాంతివంతమైన లైట్లను వాడొద్దని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.  

 

కొన్నేళ్ల క్రితం ఈ పోర్టులో మెర్క్యూరీ లైట్లను తొలగించి తాబేళ్లకు అనుకూలంగా ఉండే సోడియం దీపాలను అమర్చారు. దీనికి తోడు అన్ని దీపాలు కిందవైపు వంచి ఉంటాయి. మొత్తానికి డీఆర్ డీవో ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఆలీవ్‌ రిడ్లీ తాబేళ్లతో ఈ ప్రాంతమంతా కళకళలాడుతోంది. టూరిస్టులు సైతం తాబేళ్లను సందర్శిస్తూ కేరింతలు కొడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: