ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 106 రోజుల తర్వాత చిదంబరం జైలు నుంచి బయటికొచ్చారు. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కార్తీ చిదంబరం.. రేపు పార్లమెంట్‌ సమావేశాలకు తన తండ్రి హాజరవుతారని తెలిపారు. చిదంబరం ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం... బెయిల్ మంజూరు చేసింది. 106రోజులుగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఎట్టకేలకు విడుదల కానున్నారు. రెండు లక్షల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని , మీడియాతో మాట్లాడవద్దని జస్టిస్ ఆర్ .భానుమతితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆర్ధిక నేరాలు తీవ్రమైనే అయినప్పటికీ... ప్రతి కేసును విడివిడిగా చూడాలన్న ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. 

 

కస్టడీలో ఉన్న సమయంలో కూడా చిదంబరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. మలాండరింగ్ లాంటి ఆర్ధిక నేరాలు ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో చిదంబరానికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ప్రమేయం లేదని... కపిల్ సిబల్ తో పాటు అభిషేఖ్ మను సింఘ్వీ వాదించారు. 

 

ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఆగస్టు 21 న సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసింది. సీబీఐ పెట్టిన కేసులో బెయిల్ మంజూరైనా...అప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చిదంబరం చుట్టూ ఉచ్చు బిగించడంతో జైలుకే పరిమితమయ్యారు. 2007లో కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలోకి 305 కోట్ల రూపాయల విదేశీ నిధులను తరలించడంలో ఆర్ధిక మంత్రి హోదాలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్నది చిదంబరంపై ఉన్న అభియోగం.  తండ్రికి బెయిల్ రావడంపై కార్తీ చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటు శీకాతాల సమావేశాలు జరుగుతున్న సమయంలో.. చిదంబరం బెయిలుపై విడుదల కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: