బుల్లెట్‌ రైళ్లు ఢిల్లీ, ముంబైలకేనా...? అభివృద్ధంటే... నార్త్‌ ఇండియానేనా..? కేటాయింపులు నాగపూర్‌, గుజరాత్‌, చెన్నైకేనా అంటూ మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రాజకీయ కారణాలతోనే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. అసలు దక్షిణాదినే చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగానే... తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. నార్త్‌ ఇండియాపై ఉన్న శ్రద్ధ.. సౌతిండియాపై లేదన్నారు కేటీఆర్‌.  దక్షిణ భారత దేశం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలన్నారు కేటీఆర్‌. సీఐఐ నిర్వహించిన డిఫెన్స్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్న కేటీఆర్‌... పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్‌ బెంగుళూరు రూట్‌లో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుచేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 

 

పనిచేస్తున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే... అవి మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాయన్నారు కేటీఆర్‌. దురదృష్టవశాత్తు.. మన దేశంలో పనిచేసే రాష్ట్రాలకు తోడ్పడాలని.. వాటిని మరింతగా ప్రోత్సహించాలనే దిశగా కేంద్రం ఆలోచించడంలేదన్నారు. బుల్లెట్‌ రైలు అంటే ఢిల్లీ, ముంబయిలేనా.. హైదరాబాద్ గుర్తురాదా? అని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అంటే ఢిల్లీ, చెన్నై, నాగ్‌పూర్‌, గుజరాత్‌ లేనా..! హైదరాబాద్‌ గుర్తు రాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ రకమైన ప్రవర్తన కేంద్రానికి మంచిది కాదని.. ఆలోచనలు మారాలన్నారు. పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదన్నారు. 

 

హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇకో సిస్టం మరే సిటీలో ఉండవని... ఎంట్రపెన్యూర్స్‌, టెక్నికల్‌ అండ్‌ స్కిల్డ్‌ ఎంప్లాయిస్‌ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నారని అన్నారు కేటీఆర్‌. కేంద్రం సహకరిస్తే... మరిన్ని ఒరవడులకు నాంది పలకొచ్చని.. ఎన్నో నూతన ఆవిష్కరణలు సృష్టించొచ్చన్నారు. మొత్తానికి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. దక్షిణ రాష్ట్రాలపై వివక్ష తగదని మండిపడ్డారు. అభివృద్ధికి నోచుకోని ఎన్నో ప్రాంతాలు తమ రాష్ట్రంలో ఉన్నాయని వాటి గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవాలని మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: