జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. .రాయలసీమ ఆత్మీయ యాత్ర పేరుతో ఆ ప్రాంతంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ...హాట్ కామెంట్లు చేశారు. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేనాని వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, పవన్ కామెంట్ల‌పై బీజేపీ ఇప్ప‌టికే స్పందించింది. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని, అందుకు తన వంతు సహకారం అందిస్తామని ఆ బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి,  ఎంపీ జీవీఎల్ నరసింహరావు భరోసా ఇచ్చారు.

 


కేంద్రంలో ఉన్న అమిత్ షా, మోడీ త‌మ‌కు వచ్చిన మెజారిటీతో దేశ రక్షణకు, సమగ్రతకు కావాల్సిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటుంటే, వైసీపీ ప్రభుత్వం కనీసం సామాన్యుడికి రూ.25 ఉల్లిపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంద‌ని ఎద్దేవా చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉల్లిపాయలు ఇవ్వకపోతే మీకు వచ్చిన మెజారిటీ ఎందుకని ప్ర‌శ్నించారు. టీడీపీతో కలిసి ఉన్నాం అనే అంశంలో వైసీపీ ఏడు చేపల కథే చెబుతోందని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ``2014లో మాదిరి బీజేపీ, టీడీపీలతో కలసి పోటీ చేద్దాం అని ప్రధాని, చంద్రబాబుల దగ్గరకు వెళ్లి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు మాట్లాడే వాళ్లంతా ఎక్కడ ఉండే వారు? ప్రత్యేక హోదా అంశం మీద ప్రజల కోరిక మేరకు ప్రధానితో విబేధించాల్సి వచ్చింది. టీడీపీతో కలసి ఉంటే విడివిడిగా బరిలోకి దిగాల్సిన అవసరం ఏంటి? అంత గొడవ పెట్టుకున్న తర్వాత వెళ్లి కలవడానికి ఎవరికైనా మనసు ఒప్పుతుందా? అలా అనుకుంటే వైసీపీ నాయకుల నుంచి కూడా నాకు కబురు పంపారు. వారి గురించి బహిరంగంగా మాట్లాడితే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వారికి తెలుసు. ముగ్గురి మధ్య జరిగినదాన్ని బహిరంగపరిచే సంస్కారం నాకు లేదు. మీరు కబురు పంపితే ఎంత గౌరవంగా సమాధానం చెప్పి పంపానో కూడా నాకు తెలుసు.`` అంటూ ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

అయితే, ప‌వ‌న్‌తో మాట్లాడిన ఆ నేత‌లు ఎవ‌రు?  నిజంగానే వైసీపీ జ‌న‌సేన‌తో పొత్తుకు ప్ర‌య‌త్నించిందా?  ప్ర‌య‌త్నిస్తే..ప‌వ‌న్ ఎందుకు అంగీక‌రించ‌లేదు....ఇప్పుడెందుకు ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు?  ప‌వ‌న్‌తో పొత్తు ప్ర‌య‌త్నం విష‌యంలో వైసీపీ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది? అనే ప్ర‌శ్న‌ల‌న్నీ ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: