తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికల కోసం అజెండాను సిద్ధం చేస్తూనే.. 2023 ఎన్నికల కోసం కూడా రెడీ అవుతోంది. 

 

తెలంగాణ కాంగ్రెస్  కోర్ కమిటీ సమావేశం లో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై చర్చించింది. దిశపై జరిగిన హత్యాచారానికి మద్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో మహిళల మద్దతుతో.. మద్యపాన నిషేధం పై పోరాటం చేయాలని చూస్తోంది. అయితే సమావేశంలో... సంపూర్ణ మద్యపాన నిషేధం అయ్యే పనేనా..? లేదంటే మద్యపానం నియంత్రణ చేయాలా..? అనే దానిపై చర్చ జరిగింది. మెజారిటీ నాయకులు మాత్రం... మద్యపానం పై నియంత్రణ చేపట్టాలంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా ప్లాన్ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం పార్టీలో నాయకత్వ మార్పు మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి...కార్యాచరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అధికారంలోకి వస్తే మాత్రం నియంత్రణ చేస్తామని చెప్పాలని అనుకుంటోంది కాంగ్రెస్. 

 

దిశ కేసుతో పాటు..రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల అంశాన్ని కూడా కాంగ్రెస్ కొంత రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. ఆర్టీసీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన తరుణంలో కొంత సైలెంట్ అయినా... ఈ విషయాన్ని వదలకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించింది. కార్మికుల బెనిఫిట్స్ తోపాటు...కార్పొరేషన్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటోంది. పెరిగిన ఆర్టీసీ చార్జీల అంశాన్ని వాడుతోంది. అధికారంలోకి వస్తే చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వచ్చిన ప్రతి సమస్యపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అజెండాను సిద్ధం చేసే పనిలో పడింది. మద్యపాన నిషేధం అంశాన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరమే. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్వ వైభవం కోసం తెగ కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ లోటు పాటులను ప్రధాన అంశాలుగా లేవనెత్తుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగానై సత్తా చాటాలని ఉవ్విళ్లూరులూరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: