మహిళలపై అకృత్యాలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగుతున్నాయి. పాలకులు మారినా, మహిళలపై అకృత్యాలు తగ్గడంలేదు. ఎవ‌రు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ‘కర్మభూమిలో పూసిన ఓపువ్వా... విరిసీ విరియని ఓ చిరునవ్వా... కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా’ అంటూ ఓ కవి కలం నుంచి జాలువారిన ఆక్రందనను పట్టించుకునేదెవరు..? అర్ధరాత్రి సంగతి అటుంచితే పగలు కూడా మహిళలు ఒంటరిగా తిరిగేందుకు వెనుక‌డుగు వేస్తుతున్నారు. రోజు రోజుకు మ‌హిళ‌ల‌పై కొందరు మృగాల ఆకృత్యాలు పెరుగుతున్నాయే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు. 

 

బ్రిటీష‌ర్ల నుంచి స్వాతంత్రం పొంది ఇన్ని సంవ‌త్స‌రాలు అవుతున్నా.. మ‌హిళ‌ల‌కు మాత్రం స్వాతంత్రం రావ‌డం లేదు. వయ స్సు, వరసలు కూడా మర్చిపోయి సమాజంలో ఉంటున్నామనే స్ప్రహ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు కొంద‌రు. ఈ క్ర‌మంలోనే మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. ఇందుకోసం మహిళలు 100, 112, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాల్సి ఉంటుందన్నారు. 

 

మహిళలు చేరుకోవాల్సిన ప్రదేశానికి టాక్సీ గానీ, భద్రతతో కూడిన రవాణా సదుపాయం గానీ లేకపోతే పోలీసులు వారికి సాయం అందిచనున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చే సమయంలో ఒక మహిళ కానిస్టేబుల్‌ తోడుగా ఉండనున్నారు. జిల్లా స్థాయిలో డీఎస్పీ గానీ, ఏసీపీ గానీ ఈ పథకానికి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఇందుకోసం కేటాయించిన వాహనాలు రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాలతో పాటు, ఇతర ముఖ్య నగరాల్లో అందుబాటులో ఉంఉనున్నాయి. అలాగే  రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ దిన్‌కర్‌ గుప్తాను సీఎం ఆదేశించారు. వాస్త‌వానికి ఇలాంటి ప‌థ‌కం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటే మ‌హిళ‌ల‌పై అకృత్యాలు చాలా వ‌ర‌కు అరిక‌ట్ట‌వ‌చ్చు క‌దా..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: