ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందా ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. చంద్రబాబు తర్వాత నాయకత్వం సమర్ధవంతంగా లేకపోవడంతో చాలా మంది ఆ పార్టీలో ఉన్న నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచార౦ ఎక్కువగా జరుగుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారు. ఈ నెలలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. ఇక దేవినేని అవినాష్ గత నెలలో పార్టీ మారడం ఆయనకు ఒక నియోజకవర్గ బాధ్యతలను కూడా జగన్ అప్పగించడం జరిగింది.

 

ఇప్పుడు వీళ్ళ బాటలోనే కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైతం  పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక మిగిలిన ఎమ్మెల్యే లు కూడా అధికార పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా కార్యకర్తలతో, తమకు మద్దతు ఉన్న ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

పార్టీ మారితే మా వెంట వస్తారా...? మీకు ఏం కావాలి..? తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు మాకు కనపడటం లేదు, ఎన్నాళ్ళు ఇలా ఉంటాం... కేంద్రంతో కూడా సహకారం లేదు... మీరు మాకు మద్దతు ఇవ్వండి అంటూ మద్దతు కోసం అభిప్రాయాలను సేకరించే పనిలో పడ్డారు. వారికి పార్టీలో ఉంటే ఎంత మాత్రం ఉపయోగం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారట. చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి భవిష్యత్తు కష్టమని వివరించే పనిలో పడ్డారు.

 

ఇక వారిలో కూడా ఒకరకమైన ఆవేదన కనపడుతుంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీతో ఎవరూ ఉండటం లేదని, అన్ని జిల్లాల్లో కూడా పార్టీని వదిలేసే సూచనలు కనపడుతున్నాయని ఇప్పుడే మారితే మంచిది అంటూ సూచిస్తున్నారట. పది మంది ఎమ్మెల్యేల వరకు ఈ పనిలో ఉన్నారట. ఇప్పుడు ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక్ కావడంతో చంద్ర‌బాబు ఎవ‌రెవ‌రు ఈ స‌మావేశాలు పెడుతున్నార‌న్న దానిపై కూపీ లాగ‌డంతో పాటు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: