ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవమైతే ఇదేనట. తానే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి వచ్చేవాడే కాదట. వైసిపికి 151 సీట్లు వచ్చాయంటే కేవలం తన వల్లే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బల్లగుద్ది  మరీ చెప్పారు. దాంతో విన్నవాళ్ళకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

 

ఎందుకంటే 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చింది కూడా తన వల్లే అని అప్పట్లో పదే పదే చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను గనుక చంద్రబాబుకు మద్దతుగా నిలవకపోతే అప్పట్లోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యుండేవాడని ఇదే పవన్ చాలా సార్లు చెప్పాడు. టిడిపి, బిజెపిలకు అనుకూలంగా కాపులు ఓట్లేశారంటే తన పుణ్యమే అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

అంటే పోయిన ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాడు. మొన్నటి ఎన్నికల్లో జగన్ ను అధికారంలోకి తెచ్చాడు. ఇంతవరకూ బాగానే ఉంది మరి తానెప్పుడు సిఎం అవుతారు ? ఇపుడిదే ప్రశ్న అందరి బుర్రను తొలిచేస్తోంది.  మొన్నటి ఎన్నికల్లో టిడిపి, బిజెపితో తాను కలుసుంటే వైసిపి అసలు అధికారంలోకి వచ్చేదేనా అని పవన్ అడిగిన ప్రశ్న విచిత్రంగా ఉంది. పైగా తాను కనిపించినపుడల్లా వైసిపి నేతలు తనకు చెయ్యెత్తి దండం పెట్టాలని కూడా అంటున్నారు.

 

నిజానికి మూడు పార్టీలు కలిసి 2014లో ఎన్నికల్లో పాల్గొన్నపుడే వైసిపికన్నా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకున్నది. మూడు పార్టీలకు, వైసిపికి మధ్య కేవలం 1.6 శాతం ఓట్లు  మాత్రమే తేడా. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో కూడా కలిసినా పెద్దగా ఉపయోగం ఉండేది కాదేమో.

 

ఎందుకంటే మూడు పార్టీలు కలిసే పోటి చేస్తాయన్న ఉద్దేశ్యంతోనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జనాల్లో చొచ్చుకు పోయేందుకు పాదయాత్ర చేసిన కారణం ఇదే. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు గబ్బుపట్టటం, టిడిపి నేతలపై అవినీతి ఆరోపణలు, అరాచక పాలన లాంటి వాటితో జనాలు విసిగిపోయున్నారు. జగన్ కష్టపడి జనాల నమ్మకాన్ని పొంది అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చాడన్న విషయం పవన్ మరచిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: