మహిళారైతు పద్మజని అరెస్ట్‌చేసి చట్టాన్ని కాపాడామంటున్న వ్యక్తులు, చట్టం కొందరికి చుట్టమనేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని, చట్టం అమలులో నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు.  గతంలో రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఉద్దేశించి, ''చంద్రబాబుని నడిరోడ్డుపై కాల్చిచంపినా తప్పులేదు'' అన్నవ్యక్తికి ఈ చట్టం వర్తించదా అని నిలదీశారు. 

 


 కొడాలినాని చేసిన వ్యాఖ్యలను ఖండించిన మహిళారైతుకి వర్తించిన చట్టం, చంద్రబాబుని చంపండి, చంద్రబాబుని చెప్పులతో, రాళ్లతో కొట్టండి అన్నవ్యక్తికి ఎందుకు వర్తించదో చట్టాన్ని అమలుచేశామంటున్న సదరు వ్యక్తులు సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అడవిలోతిరిగే పులి, చంద్రబాబు రాక్షసుడు, నారాసురుడు, నంబర్‌ వన్‌ చీటర్‌ అంటూ నోటికొచ్చినట్లు ఆనాడు మాట్లాడిన ప్రతిపక్షనేత, నేటిముఖ్యమంత్రి విషయంలో ఈ చట్టాలు ఏంచేస్తున్నాయని వర్ల ధ్వజమెత్తారు. 


సామాన్యగృహిణి వ్యాఖ్యల్ని తప్పుపట్టిన వారు, కొడాలినాని మాటల్లోని బూతులకంపుని ఎందుకు ఆస్వాదిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. నానిని ఇంటర్య్వూచేయడానికి వెళ్లిన మహిళాజర్నలిస్ట్‌ ఒకరు  సార్‌.. మీరు బూతులుమాట్లాడితే, నేను ఇంటర్య్వూ చేయనని చెప్పిందని, ఆమెతో అలా చెప్పించుకోవడానికి మంత్రినాని సిగ్డుపడాలన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని    జైలుకు పంపుతానని హెచ్చరిస్తున్న స్పీకర్‌, తాను వాడుతున్న భాష ఎలాఉందో తెలుసుకోవా లని రామయ్య హితవుపలికారు. 

 

బహిరంగప్రదేశంలో స్పీకర్‌వాడిన అసభ్యపదజాలం దేశశిక్షాస్మృతి ప్రకారం ముమ్మాటికీ శిక్షార్హమైన నేరమేనన్నారు. ఎవరెలా ప్రవర్తించినా, ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవాలనడం ఎలాంటి చట్టమో, వింతపోకడలు పోతున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. యథారాజా తథాప్రజ అన్నట్లుగా  ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తుంటే, చట్టాన్ని ఒకేతీరుగా అమలుచేసేవారు ఏం చేస్తున్నారన్నారు. నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే, కొడాలినానిపై మహిళారైతు ఫిర్యాదుదృష్ట్యా  ఆయన్నెందుకు అరెస్ట్‌ చేయలేదన్నారు. అమరావతిలో తెలుగుదేశం, వైకాపా పార్టీల మధ్య మాటల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉన్నది.  దీనికి ముగింపు ఎప్పుడో తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: