సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలు, బీజేపీ నేత డీకే అరుణ‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఊహించ‌ని షాక్ ఎదురైంది. గ‌త కొద్దికాలంగా వినిపిస్తున్న ప్ర‌చారాన్ని నిజం చేస్తూ తెర‌మీద‌కు వ‌చ్చిన వార్తల‌తో డీకే అరుణ ఇరుకున ప‌డ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి డా.కె.లక్ష్మణ్‌ను మార్చనున్నార‌ని, డిసెంబర్ నెలాఖరులోగా కొత్త అధ్యక్షున్ని నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ త‌రుణంలో...మాజీ మంత్రి డీకే అరుణ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని...ఢిల్లీ వెళ్లారని సోషల్ మీడియాలో వార్త‌ వైరల్  అయింది.

 

ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో బీజేపీ దారుణంగా హీనమైన ప్రదర్శన చేసింది. కేవలం 2650 ఓట్లు మాత్రమే పొందగలిగింది. ఈ ప్రదర్శనపై బీజేపీ అధిష్టానం...రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నాయకత్వాన్ని మార్చేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి వచ్చి వెళ్లారు. దీంతో అధ్యక్షుని మార్పు ఖాయమైందని పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి డిసెంబర్ నెలాఖరే ముహూర్తమని పార్టీ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. 

 

అయితే, ఈ తరుణంలో....కొత్త అధ్య‌క్షుడిగా పార్టీ నేత‌లు చింతల రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్, ఎన్.రామచంద్రరావుతో పాటుగా ఇటీవల పార్టీలో చేరిన డి.కె. అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు కూడా పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. తాజాగా, డీకే అరుణ ఢిల్లీ నుంచి పిలుపు అందింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. వార్త నిజం కాదని, ఇలాంటి అబద్దపు వార్తలను సృష్టించడం , ప్రచారం చేయడం సరైనది కాదని డీకే అరుణ పేర్కొంది. ఇదిలాఉండ‌గా, పరిణామాల నేపథ్యంలో మరో నెల రోజుల వ్యవధిలో లక్ష్మణ్ స్థానంలో కొత్త అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని చెప్పుకుంటున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడి మార్పు విష‌యంలో తుది నిర్ణ‌యం ఉంటుంద‌ని బీజేపీ  పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: