ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రేపు పోటాపోటీ సభలకు రంగం సిద్ధమైంది. టీడీపీ విజయవాడలో రౌండ్ టేబుల్ నిర్వహిస్తుండగా.. తెలుగు దేశం పార్టీకి పోటీగా తుళ్లూరులో కూడా రైతులు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నా... అమరావతిలో అసలేం జరిగిందనే విషయంపై రెండు వర్గాలు తమ వాదన వినిపించాలని భావిస్తున్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. రాజధానిలో టీడీపీ చేసిందేమీ లేదన్న వైసీపీ విమర్శలకు కౌంటర్ గా.. ఇప్పటికే చంద్రబాబు రాజధాని యాత్ర చేశారు. రాజధానిని ఆపేసిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేస్తోందని తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధానిపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో రాజకీయ పక్షాలు, నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. గత నాలుగేళ్ల కాలంలో జరిగిన పనులు, ప్రణాళికలపై రాజకీయ పక్షాలు, నిపుణులతో ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై రౌండ్ టేబుల్ లో చర్చించి తీర్మానం చేయనున్నారు.

 

అటు తెలుగు దేశం పార్టీకి పోటీగా తుళ్లూరులో కూడా రైతులు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధాని నిజస్వరూపం పేరుతో పెడుతున్న సదస్సు చర్చనీయాంశమైంది. తెలుగు దేశం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం మధ్యాహ్నం జరుగుతుండగా... రైతుల అఖిలపక్షం మాత్రమే ఉదయమే జరగనుంది. మెజార్టీ పార్టీలు రౌండ్ టేబుల్ కు వస్తాయని తెలుగు దేశం పార్టీ ఆశిస్తోంది. అయితే ఇంతవరకూ ప్రధాన రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఏ మీటింగ్ కు ఎన్ని పార్టీలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రేపు అమరావతిలో.. అటు తుళ్లూరులో పోటాపోటీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మీటింగ్ లపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ పరిస్థితులు ఎలాంటి నిర్ణయాల వైపు దారితీస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: