అసెంబ్లీ సమావేశాలకు ముందే టీడీపీకి షాక్ తగులుతుందనే వాదన వినిపిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్ తో జోరు పెంచామంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ నెల 9న అంసెంబ్లీ సమావేశం ప్రారంభమయ్యే నాటికే ముగ్గురు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని వైసీపీ చెబుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా తొలగించడానికి.. తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయినట్లు తెలుస్తోంది.

 

ఏపీలో టీడీపీకి భారీ షాక్ ఇవ్వాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. ఈ లోగానే టీడీపీలో భారీ కుదుపుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ మంత్రులు, పెద్దలు టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఈ జిల్లా నుంచి కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ తన పార్టీ లోకి చేర్చుకోవాలని చూస్తోంది. కొందరు ఆసక్తి చూపుతుండగా... మరికొందరు తర్జన భర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ మొదలయ్యే ముందు రోజుకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చేలా చేయాలనేది వైసీపీ వాదన. 

 

ప్రకాశం జిల్లాలో అద్దంకి, పర్చూరు, చీరాల ఎమ్మెల్యేలతో వైసీపీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో అద్దంకి ఎమ్మెల్యే వైసీపీ వైపు వెళ్లడానికి దాదాపు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న అంశాల ఆధారంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పార్టీ వీడవచ్చని తెలుస్తోంది. అయితే కరణం బలరాం, ఏలూరు సాంబశివరావుల విషయంలో స్పష్టత కనిపించడంలేదు. మరోవైపు ఆకర్ష్ లో భాగంగా జరిపిన చర్చలను సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రులు వివరించారు. దీంతో ఆకర్ష్ పై రాజకీయంగా మరింత చర్చ ప్రారంభం అయ్యింది. 

 

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఇప్పటికే బయటకు వచ్చారు. వంశీ వైసీపీలో చేరకపోయినా....టీడీపీ తో మాత్రం విభేదించారు. ఇదే సమయంలో వంశీని టీడీపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష పార్టీ వీడతారని....అధికార పార్టీనేతలు చెపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వారం రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే కేవలం ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలే కాదనీ....ఇతర జిల్లాల నుంచి కూడా ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని టీడీపీ పూర్తిగా కొట్టిపారేస్తోంది. ఎమ్మెల్యేలు అంతా అధినేతతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని....పార్టీ మారే విషయం పై ప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదని నేతలు చెపుతున్నారు. 6 వ తేదీన జరిగే  పార్టీ కార్యాలయ ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంతా పాల్గొంటారని టీడీపీ నేతలు చెపుతున్నారు. మరి వైసీపీ ఆకర్ష్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: