తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా  ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు   కన్సాలిటెడ్ ప్రతిపాదికన సాంస్కృతిక సారథి ద్వారా కళాకారులకు ఉద్యోగావకాశాలను కల్పించాలని  కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది . ఈ మేరకు  ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది  . అయితే ప్రభుత్వం ఆహ్వానించిన ఉద్యోగానికి ప్రజా యుద్ధ నౌక , విప్లవ గాయకుడు గద్దర్ దరఖాస్తు చేసుకోవడం హాట్ టాఫిక్ గా మారింది .  తాను సాంస్కృతిక సారథి  ఉద్యోగావకాశం కోసం దరఖాస్తు చేసుకున్నానన్న గద్దర్  , తనకు ఎలాగైనా ఉద్యోగావకాశం కల్పించాలని కోరడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది .

 

గద్దర్ వయస్సు ప్రస్తుతం 73  ఏళ్ళు. ఈ వయస్సులో ఆయనకు ఉద్యోగం చేయాల్సిన అవసరముందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది . తాను ప్రస్తుతం పాట పాడి, ఆడలేకపోయినా, యువ కళాకారులు పాటపాడి, ఆట ఆడుతుంటే వారి పాట కు దరువు వేస్తూ సహకారం అందించగలనని అంటున్నారు గద్దర్ . గద్దర్ ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన గొంతుక తో ఊపిరి పోశాడు . ఇక ఎన్నో  విప్లవగీతాలు ఆయన గొంతు నుంచి జాలువారుతూ తాడిత , పీడిత వర్గాలను ప్రజలను అలరించాయి  . నక్సలైట్ ఉద్యమాన్ని  విడిచి జన జీవన స్రవంతి లో కలిసిన తరువాత  జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న గద్దర్  తన ఆట , పాటలతో ఆయా  ఉద్యమాలను ప్రజాబాహుళ్యం లోకి విస్తృతంగా  తీసుకువెళ్లడం లో కీలక పాత్ర పోషించారు .

 

తెలంగాణ ఉద్యమం లోను ఆయన తన ఆటపాటలతో ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించడం లో క్రీయాశీలకంగా వ్యవహరించారు . అటువంటి గద్దర్ కు సాంస్కృతిక సారథిలో ఉద్యోగావకాశం కల్పించడం తప్పులేదు కానీ ఆయన తన సిద్ధాంతాలకు భిన్నంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తానని చెప్పడమే గద్దర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . ప్రజా యుద్ధనౌక గా పేరొందిన గద్దర్ , ప్రభుత్వానికి భజన చేస్తానని పేర్కొనడం ఏమిటని వారు ఆశ్చర్యపోతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: