తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప మాల వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఇరుముడి సమర్పించారు కూడా. ఇంకా చాలా మంది మాలలో ఉన్నారు. అయితే.. పవిత్ర శబరిమల అయ్యప్పస్వామి ఆలయం యాజమాన్యం అయ్యప్పలకు షాక్ ఇచ్చింది. శబరి మల అయ్యప్పస్వామి ఆలయం గర్భ గుడి పరిసర ప్రాంతంలో సెల్‌ఫోన్ల వాడకాన్ని బ్యాన్ చేసింది.

 

ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు ఉన్నతాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత భద్రతతో కూడిన అయ్యప్ప స్వామి గర్భాలయం, స్వామి మూర్తికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కారణంగా ఆలయ పవిత్రత, దెబ్బతింటోందని యాజమాన్యం భావించింది. వీటికి కారణమైన సెల్ ఫోన్ ను ఆయన పరిసరాల్లో నిషేధించడం ఒక్కటే దీన్ని అరికట్టేందుకు మార్గంగా భావించింది.

 

శబరి మలలో మాలధారులు 18 బంగారు మెట్లు, గర్భాలయం పరిసర ప్రాంతాలను అత్యంత పవిత్రమైన ప్రాంతాలుగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. కూలంకశంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు సభ్యులు ప్రకటించారు. అంతే కాదు.. బోర్డు ఆదేశాలను అతిక్రమించి ఆలయ పరిసర ప్రదేశాల్లో సెల్‌ఫోన్లను వాడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

 

అదే సమయంలో ఈ ఏడాది అయ్యప్ప భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని దేవస్వోమ్ బోర్డు ప్రకటించింది. నవంబరు 16 నుంచి డిసెంబరు 3 (మంగళవారం) వరకు దాదాపు 7 లక్షలకుపైగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వచ్చారట. ఈ ఏడాది నవంబరు 16 నుంచి వార్షిక మండల పూజ ప్రారంభమైంది. అప్పటి నుంచి భారీ సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల కొండకు వస్తున్నట్లు శబరిమల అయ్యప్ప ఆలయం బోర్డు తెలిపింది. సో.. ఏదేమైనా శబరి మల వెళితే మీ సెల్ ఫోన్ జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఆలయ గర్భగుడి 18 బంగారు మెట్లు. పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ వాడకండి స్వాములూ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: