రానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోపు ప్రతిపక్ష టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు ఎమ్యెల్యేలు వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు అయిందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆ ముగ్గురు ఎమ్యెల్యేలతో మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని సమావేశం అయినట్లు సమాచారం. 

 

నిన్న (డిసెంబర్ 4) సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో ఎమ్యెల్యేల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యి ఎమ్యెల్యేల పై ఎలా వ్యవహరించాలో చర్చించినట్లు సమాచారం. 

 

ఇప్పటికే టీడీపీ యువ నేత దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోగా, గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్యెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, వీరభద్ర స్వామితో ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సమావేశం అయ్యి చర్చించారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి రావాలంటే ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ జగన్ పేర్కొన్న నేపథ్యంలో, ఆ ముగ్గురు ఎమ్యెల్యేలు వల్లభనేని వంశీ బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది.

 

అసెంబ్లీ సమావేశాల్లోపే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ మద్దతు ఇవ్వనున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఆ ముగ్గురు ఎమ్యెల్యేలు. టీడీపీకి వ్యతిరేకంగా వీలైనంత ఎక్కువ మందిని రెబెల్ అభ్యర్థులు చేసి టీడీపీని ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే దెబ్బ కొట్టాలని చూస్తోంది అధికార వైసీపీ పార్టీ. వలసలంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన టీడీపీ ఆ ముగ్గురు ఎమ్యెల్యేలను బుజ్జగించే పనిలో పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: