కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు పైప్ లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ పెట్రోలియం కార్పొరేషన్(ఐఓసీఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది. రాజ్యసభలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 9,29,000 ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయటం కొరకు కేంద్ర ప్రభుత్వం ఐఓసీఎల్ తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. 
 
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఐఓసీఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీకి ఉందని పేర్కొన్నారు. 
 
ఐవోసీఎల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ హక్కుల కొరకు 9వ రౌండ్ వేలం ద్వారా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ ను సరఫరా చేయడానికి హక్కులను సంపాదించిందని తెలిపారు. ఐఓసీఎల్ ఇప్పటికే పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసిందని సిటీ గ్యాస్ డిజైన్ పనులను, హుక్ అప్ సౌకర్యాలను పూర్తి చేసిందని తెలిపారు. 
 
కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా 9.29 లక్షల ఇళ్లకు ప్రయోజనం చేకూరనుంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరావు సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంస్థల విభజనపై తరచూ సమావేశాలను నిర్వహిస్తున్నామని హోం శాఖ సహాయక మంత్రి నిత్యానంద తెలిపారు. షీలా బేడీ కమిటీ ఇప్పటికే 90 సంస్థలకు సంబంధించిన రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: