తొందరలోనే మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లోపే చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. తెలుగుదేశంపార్టికి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలు త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ప్రకాశంజిల్లాలోని నలుగురు ఎంఎల్ఏల్లో ముగ్గురు పార్టీకి గుడ్ బై చెప్పటానికి రెడీ అయిపోయారట. అంటే వీరిని వైసిపిలో చేర్చుకోవటానికి రంగం కూడా రెడీ అయిందని సమాచారం.

 

మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నలుగురు ఎంఎల్ఏలు గెలిచారు. చీరాల నుండి కరణం బలరామ్, అద్దంకి నుండి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు నుండి ఏలూరు సాంబశివరావు, కొండెపి నుండి బాల వీరాంజనేయస్వామి విజయం సాధించారు. అయితే వీరిలో గొట్టిపాటి ఒరిజినల్ గా వైసిపి ఎంఎల్ఏనే. 2014లో వైసిపి తరపున గెలిచిన గొట్టిపాటిని చంద్రబాబు బాగా ఒత్తిడికి గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు.

 

మారిన రాజకీయ పరిస్ధితుల్లో గొట్టిపాటి మళ్ళీ వైసిపిలోకి మారిపోయేందుకు మొగ్గు చూపుతున్నారట. ఈయనకు గ్రానైట్ వ్యాపారాలు బాగా ఉన్నాయి. ఇక చీరాలలో గెలిచిన కరణంది ఇంకో కథ. ఈయనకు చాలాకాలం నుండి చంద్రబాబుతో పడటం లేదు. తప్పని పరిస్ధితితుల్లో ఎంఎల్సీగా చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో చీరాల నుండి పోటి చేయటానికి ఎవరు ముందుకు రాకపోతే కరణాన్నే ఎంఎల్ఏగా పోటి చేయించారు. ఇపుడు కరణం కూడా వైసిపి వైపు చూస్తున్నారు. ఇక ఏలూరు వ్యవహారం కూడా అంతే.

 

వీరి ముగ్గరితో మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్నినాని మంతనాలు జరిపారట. అసెంబ్లీ సమావేశాల్లోపే ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసి వైసిపిలో చేరటానికి రెడీ అయ్యారట. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వీళ్ళు మంత్రులతో సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. మొత్తం మీద వీళ్ళ నలుగురు వైసిపిలో చేరితో చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. ఆ ముచ్చట కూడా అసెంబ్లీ సమావేశాల్లోపే జరిగిపోతుందని సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: